Temperatures in AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. మధ్యాహ్నం వేళ ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడికి ప్రజలు పగటి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలతో రద్ధీగా ఉండే రహదారులు.. ఎండ తీవ్రత అధికం కావటంతో వాహనాల రాకపోకలు అంతంతా మాత్రంగానే ఉంటోంది. తప్పనిసరి అత్యవసర పరిస్థితుల వల్ల ఎండలో బయటకు వెళ్తున్న ప్రజలు దాహార్తిని తీర్చుకోవటానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే నగరంలో.. చలివేంద్రాల సంఖ్య తగ్గింది. దీనివల్ల ప్రజలు పదుల రూపాయలు వెచ్చించి తాగునీటి బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. కూలీ పనులకు వెళ్తున్న దినసరి కూలీలు, ఇతర అవసరాలకు బయటకు వెళ్తున్నవారు ఎండ వేడి వల్ల తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు.. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలులకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరోమారు ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో గరిష్టంగా బాపట్లలో 43.18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట, కడప జిల్లా బద్వేలులో 43.13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మంత్రాలయంలో 42.69 డిగ్రీలు, నంద్యాలలో 42.4, పలనాడులోని నరసరావుపేటలో 42.09 డిగ్రీలు నమోదు అయ్యింది. కర్నూలు 42, ప్రకాశం 41, అల్లూరి జిల్లా 42.06, శ్రీకాకుళం 41.6, పశ్చిమ గోదావరి 41, ఏలూరు 41.2, మన్యం 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకూ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే సూచనలు వున్నాయి. సాధారణం కంటే 3-5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 46 డిగ్రీల వరకూ చేరే సూచనలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.