TDP Nyayaniki Sankellu Program: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఆయనకు మద్దతు తెలుపుతూ ‘మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’ తరహాలోనే.. 'న్యాయానికి సంకెళ్లు’ పేరుతో టీడీపీ మరో వినూత్న నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు.. 5 కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ.. చేతులకు తాళ్లు, రిబ్బన్లు, వస్త్రాలతో సంకెళ్లు వేసుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి సంకెళ్లను చూపించాలని కోరారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించాలని.. ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలన్నారు. విదేశాల్లోని తెలుగువారు భారత కాలమానం ప్రకారం ఆ సమయంలో నిరసన తెలపాలని సూచించారు. ప్రజలకు మంచి చేసినందుకు చంద్రబాబుపై కక్షగట్టి జైల్లో వేశారని, ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా సరైన వైద్య సేవలు అందించకుండా ప్రాణాలకు హాని తలపెట్టాలనే కుట్రను ఈ కార్యక్రమం ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
సంకెళ్లను ప్రపంచానికి చూపించాలి: కక్ష రాజకీయాలతో చేయని తప్పుకు జైలుకు పంపించబడ్డ చంద్రబాబు వెంట మనమంతా ఉన్నామని చెబుదామంటూ... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టంచేశారు. ఈరోజు రాత్రి 7 గంటలకు మీ చేతులకు తాళ్లతోనో, రిబ్బన్లతోనో సంకెళ్లు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్ల నుంచి వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి సంకెళ్లను ప్రపంచానికి చూపించాలని కోరారు. బాబు అరెస్ట్ ను ఖండిస్తూ. 'బాబుతోనే నేను' అంటూ ప్రకటించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.