TDP LEADERS COMPLAINT TO POLICE :శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో వీరాంజనేయస్వామి, బుచ్చయ్య చౌదరి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు కారుమూరి నాగేశ్వర రావు, వెల్లంపల్లి శ్రీనివాసు, సుధాకర్‌బాబు, ఎలీజాపై కంప్లైంట్ చేశారు. శాసనసభలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన టీడీపీ.. అసెంబ్లీ వీడియో ఫుటేజ్ పరిశీలించాలని కోరారు. పోలీస్ స్టేషనుకు వెళ్లే ముందు తుళ్లూరు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మద్దతుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున రాజధాని రైతులు చేరుకున్నారు.
మా సభ్యుల ప్రాణాలకు అపాయం కలిగించే రీతిలో దాడి: అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ లేదని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీ హై సెక్యూర్టీ జోన్ అయినా.. ప్రతిపక్షానికి ప్రతికూలమైన జోన్ అని విమర్శించారు. ఇవాళ దాడి చేసినవాళ్లు.. రేపు ప్రాణాలు తీస్తారనే అనుమానం ఉందని ఆరోపించారు. తమ సభ్యుల ప్రాణాలకు అపాయం కలిగించే రీతిలో దాడి జరిగింది కాబట్టే.. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు నిమ్మల తెలిపారు. సభలో భౌతిక దాడులు జరిగితే పోలీస్ విచారణ జరపొచ్చనే రూలింగ్.. నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మళ్లీ కోడి కత్తి తరహా డ్రామా ఆడుతున్నారని.. అందుకే కట్టు కట్టుకున్నారని ఆరోపించారు. ఉదయం సంఘటన జరిగితే ఇప్పటి వరకు వీడియో ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగానే బాలవీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్, బుచ్చయ్య చౌదరిల మీద దాడి చేశారని విమర్శించారు. తాము చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
నాపై దాడి జరిగిందనడానికి స్పీకర్ ప్రత్యక్షసాక్షి: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తనంతట తానే బ్లేడుతో చిన్న గాయం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. సుధాకర్ బాబు కావాలనే బ్లేడుతో గాటు పెట్టుకున్నారని వైసీపీ సభ్యులే చెబుతున్నారన్నారు. తనపై దాడి జరిగిందనడానికి స్పీకరే ప్రత్యక్ష సాక్షి అని డోలా స్పష్టం చేశారు.