CBN ON MLC WINNING : దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. 23వ తేదీన 23వ సంవత్సరం 23 ఓట్లతో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గాల్లో పల్టీలు కొట్టాడని ఎద్దేవా చేశారు. ఎంతో కసరత్తు చేసినా.. చివరికి బొక్కా బోర్లా పడ్డారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారని ఆరోపించారు. జగన్పై చాలా మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని.. కేవలం నలుగురు మాత్రమే తమ అసంతృప్తిని బయటపెట్టారని విమర్శించారు. బయటకు రాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని తెలిపారు.
నమ్ముకున్న వ్యక్తిని నట్టేట ముంచితే నాయకుడు కాడని స్పష్టం చేశారు. పులివెందులలో కూడా తెలుగుదేశం జెండా రెపరెపలాడిందన్నారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయి అని విమర్శించారు. ఇలాంటి సైకో చేతిలో రాష్ట్రం ఉండటం చాలా దౌర్భాగ్యం అని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత లేదని.. రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని దెబ్బతిన్నాయని మండిపడ్డారు. అభివృద్ధిని వెతుకుదామన్న రాష్ట్రంలో కనపడని పరిస్థితి అని ధ్వజమెత్తారు. అమరావతిని నాశనం చేసి.. పోలవరాన్ని భ్రష్ఠు పట్టించారని ఆగ్రహించారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర పజల భవిష్యత్తు బాగుపడాలంటే సైకో పోవాలి.. సైకిల్ రావాలని సూచించారు.
నిన్నటి విజయం తమ పార్టీ నేతలకు, రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుక.. అని అధినేత చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సునామీలా విజృంభిస్తుందని.. అందులో వైసీపీ గల్లంతు అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను పేదలు భరించలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.