గత 37 ఏళ్లుగా తెదేపా అనేక ఎన్నికలు చూసిందని.. కానీ ఏ ఎన్నికల్లో లేని అడ్డంకులు ఈ ఎన్నికల్లో ఎదురయ్యాయని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించిన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో సీఎం మాట్లాడారు. తెదేపా క్రమశిక్షణకు మారు పేరని.. సంస్థాగతంగా బలమైన పునాదులు కలిగి ఉందని చెప్పారు. పటిష్ఠమైన వ్యవస్థగా పార్టీని రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. పార్టీ విజయానికి కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పనిచేశారని కొనియాడారు. అనేక అడ్డంకులను అధిగమించి ఓట్లేశారని.. పట్టుదలగా ముందుకొచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారంటూ అందరికీ అభినందనలు తెలిపారు.
ఓటింగ్ శాతం పెరగడం తెదేపాకే అనుకూలం...
2014 సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశలో రాష్ట్రంలోఎన్నికలు నిర్వహిస్తే, ఈసారి తొలిదశలోనే ఎన్నికలు పెట్టడం తెదేపాకే సానుకూలమైందన్నారు. ఓటింగ్ శాతం పెరగడం తమకు కలిసివచ్చే అంశమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి భాజపా, వైకాపా నేతలు అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన.. ప్రజాభిమానం మాత్రం తెదేపా పైనే ఉందన్నారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలుపు రాష్ట్రానికే కాదు దేశానికే అవసరమన్నారు.
దేశంలో ఏ పార్టీకీ లేదు
ఈ ఎన్నికలో సేవామిత్ర, బూత్ కమిటి,ఏరియా కమిటీలను కొత్తగా ఏర్పాటు చేశామని వారంతా కలిసికట్టుగా గట్టిగా పనిచేశారని కితాబిచ్చారు. తెలుగుదేశం పార్టీకి 55వేల మంది బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు. 4లక్షల మంది సేవామిత్రలు ఉన్నారు. రాష్ట్రంలో 60లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇంత గొప్ప సంస్థాగత బలం దేశంలో మరే పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ ఒక సమర్ధ కుటుంబంగా పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.