తెలుగు రక్షణకు భాషావేత్తలు ఉద్యమస్థాయిలో పనిచేయాలన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. వీధి అరుగు, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భాషా సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. మాతృ భాష లేనిదే మనిషికి మనుగడ లేదన్నారు. అమ్మభాష మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా భావించాలని సూచించారు. ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు ఇలాంటి కార్యక్రమాలకు చేయూత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. భాషను ప్రజలకు చేరువచేసే కార్యక్రమాలు చేపడతాయని ఆశిస్తున్నానని చెప్పారు.
'తెలుగు రక్షణకు భాషావేత్తలు ఉద్యమస్థాయిలో పనిచేయాలి. మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదు. అమ్మభాష మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా భావించాలి. ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు. రేపు గిడుగు 158వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. భాషను ప్రగతిశీలం చేసిన యుగపురుషుడు గిడుగు రామమూర్తి. కందుకూరి, గురజాడ, గిడుగు.. వాడుకభాషను జనం వద్దకు చేర్చారు. తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న వారికి అభినందనలు' - జస్టిస్ ఎన్వీ.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రేపు.. గిడుగు 158వ జయంతి సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న వారికి అభినందనలు తెలిపారు. దేశవిదేశాల్లో పేరు తెచ్చుకున్న తెలుగు ముద్దుబిడ్డలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగువాళ్లు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభ చాటుకున్నారని.. ప్రస్తుతం తెలుగుభాషకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్నారు. ఏ సమాజంలోనైనా భాష, సంస్కృతి పెనవేసుకుని ఉంటాయని చెప్పారు. సర్దుబాట్లు చేసుకుని సమాజం, భాష, సంస్కృతికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. తెలుగు సమాజం నిత్యం సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకెళ్తోందన్నారు. జపాన్, చైనాలో నేటికీ మాతృభాషలోనే విద్యాభ్యాసం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా వాడుకోవాలని సూచించారు.
'నందమూరి తారకరామారావు అగ్రశ్రేణి సినీనటుడిగా వెలుగొందడం వలనే ఆయన సులువుగా అధికారంలోకి రాగలిగారని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయి. అందులో సందేహం లేదు. కానీ, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నం. ఊరూరా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుతమైన ఉచ్ఛారణతో అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన వాక్చాతుర్యం.. ఆయన విజయంలో కీలక పాత్ర వహించింది. ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉంది. తెలుగు సినిమా అర్ధం కావాలంటే ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు భాషను కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉంది. ఇకనైనా మేల్కొని దిద్దుబాటు దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉంది. కాపాడుకునేందుకు ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ సిద్ధం కావాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భాషను మలచుకుంటూ .. ప్రపంచ భాషల్లోని మంచిని సమ్మిళితం చేసుకుంటూ మన భాషను సుసంపన్నం చేసుకోవాలి. అదే సమయంలో తెలుగు మాధ్యమంలో చదవితే భవిష్యత్ ఉండదనే అపోహలు తొలగించాలి. డిగ్రీ వరకు నేను తెలుగు మాధ్యమంలోనే చదివాను. ఇంగ్లీషు అభ్యాసం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నాను. పల్లెటూరిలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకుని ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. పాఠ్య పుస్తకాలు, విద్యాబోధన వ్యహారికంలో కొనసాగడం నా లాంటి వారికి ఎంతో ఉపయోగపడింది. మనుషులంతా ఆలోచించేది మాతృ భాషలోనే.. ఆ మాతృభాషలో విద్యాబోధన కొనసాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పోటీని తట్టుకోవాలంటే ఇతర భాషలను, ప్రధానంగా ఆంగ్ల భాషను విస్మరించలేం. అలా అని ఆంగ్లం కోసం తెలుగును త్యాగం చేయాల్సిన అవసరం లేదు' - జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఈ వర్చువల్ సమావేశంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడారు. రానురానూ పరభాషల సంకరణంతో తెలుగులో తియ్యదనం పోతోందని.. ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పేరుతో విద్యార్థి దశలోనే తెలుగును దూరం చేస్తోందని వ్యాఖ్యానించారు. నిరక్షరాస్యుల నాలుక మీదే తెలుగు సజీవంగా ఉందని ఈనాడు సంపాదకులు ఎం. నాగేశ్వరరావు అన్నారు. సహజంగా జరగాల్సిన మాతృభాష పరిరక్షణ.. ప్రయత్న పూర్వకంగా చేయాల్సి రావడం శోచనీయమన్నారు. భాషని బతికించుకుని, భవిష్యత్ తరాలకు అందించడానికి అంతా కలసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:
YS VIVEKA CASE: సీబీఐ విచారణకు.. వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్