State Leaders Condolences on Darsi Bus Accident: ప్రకాశం జిల్లాలోని దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పలుపురు నేతలు స్పందించారు. ఈ ప్రమాదం తమను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదనను కల్గిస్తున్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర నేత పురందేశ్వరి విచారం వ్యక్తం చేయగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మృతులకు ఆశ్రు నివాళులు అర్పించారు.
సంతాపం ప్రకటించిన సీఎం జగన్:దర్శిలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని తెలిపినట్లు పేర్కొంది.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత:ప్రకాశం జిల్లా దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోవటం ఆయనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయన్నారు.
విచారం వ్యక్తం చేసిన బీజేపీ నేత పురందేశ్వరి:ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై భాజపా నేత పురందేశ్వరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆశ్రు నివాళులర్పించిన లోకేశ్:దర్శి సమీపాన సాగర్ కాల్వలో బస్సు పడిన దుర్ఘటనలో ఏడుగురి మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. మృతులకు ఆశ్రు నివాళులు అర్పించారు. పెళ్లి బృందానికి జరగిన ప్రమాదం మాటలకు అందని విషాధమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించటంతో పాటు.. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.