అందరూ ఉంటేనే... జీవితం సక్రమ మార్గంలో నడవటం కష్టం. అలాంటిది ఎవరూ లేకపోతే..! ఇక ఆ జీవితం నకర ప్రాయమే!? అటువంటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది "ఆమోదిని". రక్త సంబంధానికి దూరమైన అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తోంది. నా అనే వాళ్లకు దూరమై.. పయనమెటో తెలియక, గమ్యమేంటో అర్థంకాక... ఆగిపోయిన బతుకులను నేనున్నానంటూ వేలుపట్టి నడిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి.. అయిన వాళ్లు ఉండి కూడా జీవనం సాగించలేని నిర్భాగ్యులను సైతం అక్కున చేర్చుకుంటోంది. వర్ణ, కుల, మత బేధాలు లేకుండా పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తూ... అనాథలమనే భావన కలలో కూడా రానివ్వకుండా కంటికి రెప్పలా కాపు కాస్తోంది.
"అమ్మతనం".. అక్కడ దొరుకుతుంది! - amodini
అమ్మ అమ్ముల పొది అక్కడ దొరుకుతుంది. నాన్నలోని ఆప్యాయత అక్కడ కనిపిస్తుంది. ఒక్క అమ్మా నాన్న ఏంటి అక్క, అన్న... తమ్ముడు, చెల్లెలు... ఇలా ఏ బంధమైనా లభిస్తుంది. రక్త సంబంధానికి దూరమై... నీరింకిన కళ్లతో ఎదురు చూసే వారికి 'ఆమోదిని' ఆపన్న హస్తంగా నిలుస్తోంది. పేగు బంధానికి దూరమైన వారికి ప్రేమను పంచుతోంది గుంటూరు జిల్లా కాజా సమీపంలోని స్వచ్ఛంద సంస్థ.
ఓ పరదేశీయుడి ఆలోచన నుంచి...
మూడు దశాబ్ధాల క్రితం ఓ పరదేశీయుడు భారతదేశానికి వచ్చాడు. పూనే రైల్వే స్టేషన్లో ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తోంది. ఎవరైనా పాలిస్తారేమో... అని చూసిన అతని కళ్లకు ఎంత వెదికినా అక్కడెవరూ కనిపించలేదు. ఆ పాపను అతనే చేరదీశాడు. అతని ప్రయాణంలో ఇటువంటి ఘటనలెన్నో కనిపించాయి. అవన్నీ అతని మనసును కలచి వేశాయి. వెంటనే "స్ట్రీట్ కిడ్స్ కమ్యూనిటీ విలేజ్" పురుడు పోసుకుంది. ఆ వ్యక్తి పేరు మణిహరణ్, లండన్‌కు చెందిన ఆయనను పితాజీ అని ఆప్యాయంగా పిలుస్తారు ఇక్కడి ప్రజలు. ఐదు, పది మందితో ప్రారంభమైన ఆ వీధి బాలల సంరక్షణ కేంద్రం... ప్రస్తుతం ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది.
ఆమోదిని... ఓ కుటుంబం..
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ పిల్లలంతా ఓకే కుటుంబంలా ఆనందంగా గడుపుతారు. వీళ్లలో కొందరికి కుటుంబం ఉన్నా... ఇక్కడ ఉండడానికే ఇష్టపడుతుంటారు. ఈ చిన్నారులతో కాసేపు కాలక్షేపం చేసేందుకు మనసున్న వాళ్లు తరచుగా వస్తుంటారు. తోచినంత సాయం చేస్తుంటారు. కల్లాకపటం ఎరుగని ఈ స్వచ్ఛమైన పసి హృదయాలను పలకరించి వెళుతుంటారు.
"నా అనే వాళ్లు లేని ఒంటరి తనంతో బెరుకుగా ఆమోదిని అమ్ముల పొదికి చేరుకునే అభాగ్యులు... విద్యా బుద్ధులతోపాటు విలువలు నేర్చుకుని మొక్కవోని ధైర్యంతో బయటికొస్తున్నారు. ఈ ఆమోదిని ఇంకెందరికో ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం."