ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దీని కోసం కఠినమైన నిబంధనలు తీసుకురావాలని సూచించారు. నకిలీ మందుల కట్టడి కోసం డ్రగ్ కంట్రోల్ విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై దృష్టి పెట్టాలన్న సీఎం... నిబంధనలు ఉల్లంఘించే డ్రగ్ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఔషధాల నియంత్రణలపై సమీక్షించిన సీఎం జగన్... ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మందులపైనా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విజయవాడలోని ల్యాబ్‌తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌లలో సామర్థ్యం పెంపునకు సీఎం ఆంగీకరించారు. నకిలీ మందుల తయారీ, విక్రయం, నాణ్యతలేని మందుల తయారీ, విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు ఇవ్వాలని సీఎం సూచించారు. అలాగే ప్రజల నుంచి, ఇతరత్రా వ్యక్తులనుంచి నిరంతర ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. నెలరోజుల్లో వీటికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు.