Schools Reopening Problems: హేతుబద్ధీకరణ కారణంగా రాష్ట్రంలో 12 వేలకు పైగా స్కూళ్లు.. ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో ఊరిలోని బడి ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా గత సంవత్సరం 3.98 లక్షల మంది ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. తరగతుల విలీనం, హేతుబద్ధీకరణ ఈ సంవత్సరం ప్రవేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పాఠశాలలు తెరిచే లోపు నాడు-నేడు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అవి అసంపూర్తిగానే ఉన్నాయి. రెండోవిడత పనులు చేపట్టి 20 నెలలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాణ సామగ్రిని ఆవరణలో పడేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడనున్నారు. నాడు-నేడుకు నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. రెండోవిడతకు మొదట్లో నిధులు ఇవ్వకపోవడంతో ఐదారు నెలలు పనులు నిలిచిపోయాయి. మార్చిలో నిధులు విడుదల చేయగా.. ఏప్రిల్ నుంచి పరీక్షలు రావడంతో పనులు జరగలేదు. కొన్నిచోట్ల సిమెంటు బస్తాలను బడుల్లోనే నిల్వచేశారు. ఇలాంటిచోట గదుల కొరత ఏర్పడనుంది. చాలా బడుల్లో అదనపు గదులు పూర్తి కాలేదు. వీటికి తీసుకొచ్చిన సామగ్రి వృథాగా ఉంది. మూడు విడతల్లో అన్ని పాఠశాలల్లో వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వం.. రెండో విడత పూర్తి చేసేందుకే ఆపసోపాలు పడుతోంది.
విద్యార్థులకు బడుల్లో టాయిలెట్లు అవసరం. కొత్త నిర్మాణాలు, మరమ్మతుల కోసం కొన్నిచోట్ల ఉన్నవాటినీ పని చేయకుండా చేశారు. 14వేల 76 పనులు మంజూరు కాగా.. ఇప్పటికీ 52శాతం మాత్రమే ఖర్చు చేశారు. తరగతి గదుల మరమ్మతులు 14 వేల 25 పాఠశాలల్లో చేయాల్సి ఉండగా.. 2 వేల 348 మాత్రమే పూర్తి చేశారు. వంటగదులు 9వేల 226 నిర్మించాల్సి ఉండగా.. ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. విద్యుదీకరణకు 28.71శాతం వ్యయమే చేశారు.