SAND MINING ISSUE VIRAL IN GUNTUR : దండా నాగేంద్ర కుమార్.. పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన వైసీపీ నాయకుడు. పెదకూరపాడు MLA నంబూరు శంకరరావు అనుచరుల్లో ఒకరు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై.. గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన NGT.. ఇసుక తవ్వకాలు ఆపాలని.. జరిమానాలు విధించాలని ఆదేశించింది. ఐతే ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశాలతోనే తాను NGTని ఆశ్రయించానని నాగేంద్ర కుమార్ వివరించారు. గతంలో జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న MLA.. ఇప్పుడు తానే తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా.. జేపీ వెంచర్స్ ప్రతినిధుల్ని MLA బెదిరించిన వీడియోలను ఆయన బయటపెట్టారు.
ఐతే..ఇప్పుడు ఎమ్మెల్యేనే ఇసుక తవ్వకాలు చేస్తుండంతో.. గతంలో తాను NGTలో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని నాగేంద్రకుమార్ ఆరోపించారు. మాట వినలేదనే కక్షతో.. ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించారని వాపోయారు. MLA నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.
"ఎమ్మెల్యే గారు ఒక్కటే చెపుతున్నాను. ఆ రోజు మీరు నన్ను భయపెట్టి కేసు పెట్టించారు. మళ్లీ ఈరోజు మీ పెంపుడు కొడుకు నంబూరి కల్యాణ చక్రవర్తి నాపై దాడులు చేస్తానని.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తానని మీ ఇంట్లోనే హెచ్చరించాడు. ఈ కేసును వాపస్ తీసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ దానికి నేను తలవంచను. కేంద్ర ప్రభుత్వం ప్రకారం 25 హెక్టార్ల లోపు ఉన్న వాటికి మాన్యువల్‌గా ఇసుక తీయాలి. అంటే భారీ పరికరాలు వాడకూడదు. కానీ మన రాష్ట్రంలో 5 హెక్టార్ల లోపు హెవీ మెకానైజైడ్తో తవ్వుతున్నారు"-దండా నాగేంద్ర కుమార్, ధరణికోట