ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ మద్యం కేసు.. ఈడీ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్‌ పేర్లు - ED chargesheet latest news

Delhi Liquor Scam Update: దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది.

Delhi Liquor Scam Update
Delhi Liquor Scam Update

By

Published : Feb 2, 2023, 5:12 PM IST

Delhi Liquor Scam Update: దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్టు ఈడీ వివరించింది. వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. కవిత ఆదేశంతో అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ వెల్లడించింది.

ఈ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురి పేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది. సౌత్‌గ్రూప్‌ లావాదేవీల్లో శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు సమాచారం. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది.

తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు మందస్తు బెయిల్‌ తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. నవంబర్‌ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో 3వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సమీర్ మహేంద్రు మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి ఛార్జిషీట్ పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details