REAL ESTATE DOWN IN AP: ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి రంగం వృద్ధి కలలా కరిగిపోయింది. అమరావతి రాజధాని ప్రకటనతో ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపారం.. ప్రభుత్వం మారి రాజధాని పనులు నిలిచిపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయంలో.. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడింది.
2015-16, 2021-22 సంవత్సరాల్లో.. రిజిస్టరైన డాక్యుమెంట్లు, ప్రభుత్వాలకు వచ్చిన ఆదాయపరంగా చూస్తే.. రెండు రాష్ట్రాల మధ్య తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2015-16లో తెలంగాణలో 10.62 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా.. ప్రభుత్వానికి 3,786 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో15.12లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా 3,585.12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తెలంగాణలో కంటే ఏపీలో.. 4.5 లక్షల రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగినా.. ఆదాయం తెలంగాణకే 200.88 కోట్ల రూపాయలు అధికంగా వచ్చింది.
2021-22కి వచ్చే సరికి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు.. దాదాపు రెట్టింపయ్యాయి. 20.38 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2015-16తో పోల్చితే.. తెలంగాణలో రిజిస్ట్రేషన్లు 91.91 శాతం, ఆదాయం 228.29 శాతం పెరిగాయి. 2015-16తో పోల్చితే.. ఏపీలో రిజిస్ట్రేషన్లు 70.23 శాతం, ఆదాయం 104.89 శాతం పెరిగాయి. 2015-16లో.. తెలంగాణ ప్రభుత్వానికి 3,786 కోట్ల రూపాయల ఆదాయం రాగా.. 2021-22 నాటికి అది 12,429 కోట్ల రూపాయలకు చేరింది.
2015-16 లెక్కలతో పోల్చి చూస్తే 2021-22లో.. ఏపీకి దాదాపు 12వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి. కానీ 7,345.88 కోట్లే వచ్చింది. 2015-16లో ఇరు రాష్ట్రాల మధ్య ఆదాయంలో వ్యత్యాసం 5.60 శాతం ఉంటే.. అది 2021-22కి 69.21 శాతానికి పెరిగింది. ప్రాప్‌టైగర్ అనే సంస్థ దేశంలోని 8 అగ్రశ్రేణి నగరాల్లో.. స్థిరాస్తి రంగం పురోభివృద్ధిపై చేసిన అధ్యయనం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కంటే రెండో త్రైమాసికంలో.. ఫ్లాట్ల విక్రయాల్లో అత్యధిక వృద్ధి నమోదైన నగరాల్లో అహ్మదాబాద్ తర్వాత... హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో 21 శాతం వృద్ధి నమోదైంది.
రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే!:రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారికి అమరావతి చుక్కానిలా కనిపించింది. అనతికాలంలోనే.. అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ రావడంతో చుట్టుపక్కలున్న విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి వంటి ప్రాంతాలకూ.. గిరాకీ పెరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారికి అటూ ఇటూ..భారీ ప్రాజెక్టులు చేపట్టాయి. ఇటు విజయవాడలోనూ, అటు గుంటూరులోనూ.... నిర్మాణ రంగం ఊపందుకుంది.