Protests Against Chandrababu Naidu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దీక్షలు కొనసాగుతుండగా.. కాలవ శ్రీనివాసులు సందర్శించి సంఘీభావం తెలిపారు. శింగనమలలో జలదీక్షకు ఏపీ రైతుసంఘం, సీపీఐ నాయకులు మద్దతు పలికారు. సత్యసాయి జిల్లా కదిరిలో దీక్షలకు భవన నిర్మాణ కార్మికులు సంఘీభావం తెలిపారు. హిందూపురంలో శిరోముండన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలో మున్సిపల్ కార్యాలయ కూడలిలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. శ్రీకాళహస్తిలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోషాలు తొలగాలని చమలకోల్తో కొట్టుకుంటూ అధినేతకు అండగా నినదించారు.
వైఎస్‌ఆర్ జిల్లా కడపలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మైదుకూరు, కమలాపురంలోనూ ఆందోళనలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పత్తికొండ, ఎమ్మిగనూరులో రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. కర్నూలులో చేపట్టిన దీక్షల్లో టీడీపీ నేత టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మహిళలు ప్రధాన రోడ్లను చీపుర్లతో శుభ్రంచేస్తూ నిరసన తెలిపారు. ఒంగోలులో దీక్షా శిబిరాన్ని ట్రాన్స్‌జెండర్స్ సందర్శించి మద్దతు తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకిలో బాబుకు మద్దతుగా మహిళలు నినదించారు.
TDP Leaders Agitations in AP: పల్నాడు జిల్లా అమరావతిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఉయ్యూరు నగర పంచాయతీ హాల్లో టీడీపీ కౌన్సిలర్లు బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం దాములూరులో జలదీక్ష, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నందిగామలో దీక్షలకు జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. గుంటూరు దీక్షల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొని మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజా గాయకుడు పీవీ రమణ తన పాటలతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.