Sand Mining Contract to Jaiprakash Power Ventures: గతంలో ప్రజలకు ఉచితంగా లభించే ఇసుకను టన్నుకు 475 రూపాయలు చెల్లించి కొనే పరిస్థితిని తీసుకొచ్చి, సొంత పార్టీ నేతలకు కాసులు కురిపించే వనరుగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్న.. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం నిరాటంకంగా సాగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేస్తున్నట్లు ఉంది.
ఎందుకంటే.. ఇసుక వ్యాపారానికి సంబంధించి గుత్తేదారు సంస్థగా ఉన్న జేపీ వెంచర్స్ లిమిటెడ్‌తో ఒప్పందం ఈ నెల 13తో ముగియనుంది. మరోమారు ఆ సంస్థకే కట్టబెట్టాలని గనులశాఖ నుంచి ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదన వెళ్లింది. ఇదంతా వైసీపీ నాయకుల ప్రయోజనం కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు, విక్రయానికి 2021 మే 14న జేపీ సంస్థతో గనులశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గడువు ఈ నెల 13తో ముగుస్తోంది. మళ్లీ టెండర్లను పిలిచే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. రెండు నెలల కిందటే దాని ప్రక్రియ మొదలుపెట్టాలి. ఇప్పటి వరకు అదేమీ చేయలేదు. తాజాగా జేపీ సంస్థను కొనసాగించేలా గనులశాఖ ప్రభుత్వానికి ఫైల్ పంపినట్లు తెలిసింది.
గనులశాఖ, జేపీ సంస్థల పరస్పర అంగీకారంతో మరో రెండేళ్లు ఒప్పందం పొడిగించుకోవచ్చని నిబంధన ఉన్నట్లు గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ నిబంధననే ప్రకారం.. జేపీ సంస్థ వ్యాపారం కొనసాగించేలా గడువును పెంచేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. అది ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాలా అనేది గనుల శాఖ వర్గాలు వెల్లడించడం లేదు. ప్రభుత్వం ఈ వారంలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
అమల్లో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేసింది. 2019 సెప్టెంబరు 5 నుంచి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టింది. టన్ను 375 రూపాయల చొప్పున ధర నిర్ణయించి విక్రయించారు. ఇందులో వివిధ రకాల లోపాలు ఉండటంతో ప్రైవేటు కంపెనీలకు ఇసుక వ్యాపారాన్ని అప్పగించేందుకు టెండర్లు పిలిచారు.