గుంటూరు జిల్లా పల్నాడులో ఎన్నికలు జరిగినప్పుడల్లా హింస చెలరేగడం పరిపాటిగా మారింది. ఈ సారత్రిక ఎన్నికల సమయంలో అది మరింత పెచ్చుమీరింది. ఏకంగా అభ్యర్థులపైనే దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన అనుచరులపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి... సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుతోపాటు కొందరు నాయకులు, కార్యకర్తలపైనా కేసు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ వైకాపా ఆందోళనకు సిద్ధమవుతోంది.
పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు నరసరావుపేట మండలం ఉప్పలపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబుపై వైకాపా కార్యకర్తలు దాడి చేయగా... అయన చేతికిగాయమైంది. అరవిందబాబు కారు అద్దాలు పగలగొట్టారు. మాచర్లలో తెదేపా అభ్యర్థి అంజిరెడ్డి, ఆయన బంధువు వెంకటరెడ్డిపైనా దాడి చేశారు. గురజాల వైకాపా అభ్యర్థి కాసు మహేశ్‌రెడ్డి, వేమూరు అభ్యర్థి మేరుగ నాగార్జునపైనా దాడికి పాల్పడ్డారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, తెనాలి, వేమూరు ప్రాంతాల్లోనూ ఘర్షణలు జరిగాయి. ప్రధానంగా తెదేపా, వైకాపాలకు చెందిన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గాయపడ్డారు. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కొన్ని పల్లెల్లో పరస్పర దాడులు జరుగుతున్నాయి. నాదెండ్ల మండలం ఇర్లపాడు, చందవరం, దుర్గి మండలం జంగమహేశ్వరంపాడులో ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈసారి ఓట్ల లెక్కింపునకు 40 రోజులకుపైగా సమయం ఉండటంతో పల్నాడులో ఉద్రిక్తతలను అదుపుచేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటికే 30 వరకు అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు కొనసాగిస్తున్నారు. అవసరమైన గ్రామాలకు అదనపు బలగాలను పంపే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో ఏ చిన్న వివాదం తలెత్తినా... అది ఇరుపార్టీల ఘర్షణకు దారితీస్తుంది. పోలింగ్ రోజు గొడవలు చేసినవారిని అరెస్టు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నాయకులు పరామర్శల పేరిట గ్రామాల్లో పర్యటించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని... శాంతిభద్రతల పరిరక్షణ ప్రక్రియపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ చర్యలు చేపడుతున్నామని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు చెబుతున్నారు. గ్రామాల్లో ఉండే చాలామంది సాధారణ ప్రజలు భయంతో ఉన్నారు. ఎప్పుడు ఎవరెవరికి గొడవ జరుగుతుందో... అది ఎవరికి చుట్టుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఓట్ల లెక్కింపు పూర్తయితే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.