పోలేరమ్మ తల్లి... తెలుగునాట చాలా ఊర్లలో గ్రామదేవతగా పూజలుందుకుంటుంది. ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా... ఈ గ్రామదేవత రక్షిస్తారని నమ్మకం. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో వెలిసిన పోలేరమ్మ... వందల ఏళ్లుగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారు ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి వచ్చి ఇక్కడ వెలసినట్లుగా చరిత్ర చెబుతోంది.
అప్పట్లో గిరిపురంగా పిలువబడే ఈ ప్రాంతంలో రైతులు కరవుతో భూమి శిస్తు చెల్లించలేదట. రైతుల్ని అప్పటి పాలకులు అద్దంకిలోని చెరసాలలో ఉంచారట. అద్దంకిలో అమ్మవారి జాతర జరుగుతున్న సమయంలో తామూ ఉత్సవం చూస్తామని రైతులు అడగ్గా... అధికారులు అంగీకరించారు. కరవుతో శిస్తు కట్టలేకపోయాం... మమ్మల్ని చెరసాల నుంచి విముక్తి చేయమని రైతులు అమ్మవారిని ప్రార్థించారని... అదేరోజు రాత్రి చెరసాల తలుపులు విరిగిపోవటం, అధికారులు స్పృహ కోల్పోవటం... అమ్మవారు ఆకాశవాణి రూపంలో రైతులను వెళ్లిపోమ్మని చెప్పడంతో వారంతా బయటపడ్డారని కథలు కథలుగా చెప్పుకుంటారు.
గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా... పొలంలో దున్నే నాగలి విరిగిపోయింది. భూమి నుంచి రక్తం పైకి వచ్చి ప్రవహించిందట. అక్కడ శిల నుంచి రక్తం కారుతుండటం గమనించారు. అదే సమయంలో కొందరికి అమ్మవారు పూని... తాను పోలేరమ్మనని... రైతుల కోరిక మేరకు అద్దంకి నుంచి వచ్చానని చెప్పారట. దీంతో రైతులు అక్కడ గుడి కట్టి పూజలు ప్రారంభించారు. ఇది జరిగి 450 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఉగాది దాటిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని ఆలయ పూజారులు చెబుతున్నారు.
ఈ ఉత్సవాల్లో గ్రామస్థులంతా కులమతాలకు అతీతంగా పాల్గొంటారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాది ఉత్సవాలు గత శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోలేరమ్మకు చలిమిడులు, ఉండ్రాళ్లు, గుగ్గిళ్లు నైవేద్యంగా సమర్పించారు. మేకపోతుని అలంకరించి అమ్మవారి స్వరూపంగా పూజించారు. అమ్మవారు వెలసిన సమయంలో నాగలి దున్నుతున్న వారి వంశీయుల ఇంటి నుంచే అమ్మవారి స్వరూపంలోని మేకపోతుని ఊరేగింపుగా తీసుకొవచ్చారు. ఆలయం ముందు ఉన్న సిడిమానుకు మేకపోతుని కట్టారు.
పూజా కార్యక్రమాల తర్వాత సిడిమాను ఊరేగింపు నిర్వహించారు. ఆ సమయంలో భక్తులు జీడిమామిడి కాయల్ని అమ్మవారికి సమర్పించుకున్నారు. అమ్మవారి స్వరూపంగా భావించే మేకపోతు పైకి జీడికాయల్ని విసిరి మొక్కులు తీర్చుకున్నారు. 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సిడిమాను సంబరం కీలకమైనది. ఆ సంబరంలో పాల్గొన్న వారు గ్రామం చుట్టూ టెంట్లు వేసుకుని... అక్కడే వంటలు వండుకొని భోజనాలు చేస్తారు. చివరి రోజున అమ్మవారికి పొంగలి నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఏళ్ల తరబడి వస్తున్న ఈ సంప్రదాయంలో తాము భాగస్వామ్యులమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు.