Pending Bills in AP: గత ఏడాది జులై 4న భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు125వ జయంత్యుత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ హాజరయ్యారు. ప్రధాని కోసం 3 హెలిప్యాడ్‌లు, సీఎం కోసం ఒక హెలిప్యాడ్ నిర్మించారు. వీటికి అయిన వ్యయం దాదాపు కోటి 30 లక్షల రూపాయలు. ఈ పనులు చేసిన నలుగురు గుత్తేదారులు బిల్లుల కోసం ఇప్పటికీ ఆర్ అండ్ బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ఏ కార్యక్రమమైనా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచే సీఎం జగన్ వర్చువల్‌గా పాల్గొనేవారు.
కొద్ది నెలలుగా ప్రతి రెండు, మూడు రోజులకు ఏ చిన్న కార్యక్రమమైనా ఏదో ఒక జిల్లాకు సీఎం వెళ్తున్నారు. దీంతో పెద్దఎత్తున హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్న గుత్తేదారులకు.. బిల్లులివ్వకుండా వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో రహదారులు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది రోడ్లపై గుంతలు పూడ్చిన గుత్తేదారులకు కూడా ఇంకా పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. ఇదే గుత్తేదారులు సీఎం పర్యటనల సమయంలో హెలిప్యాడ్‌ల నిర్మాణం, బారికేడింగ్ ఏర్పాటు తదితర పనులు చేస్తున్నారు.
AP Contractors bills Problems: రాష్ట్రంలో బిల్లుల గోస.. వారికి మాత్రమే చెల్లింపులు..
వీరికి పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. సాక్షాత్తు సీఎం పర్యటనకు చేసిన పనులు కావడంతో, వెంటనే బిల్లులు ఇస్తారని ఎదురుచూస్తున్న గుత్తేదారులకు నిరాశ తప్పడంలేదు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 కోట్లకుపైగా ఇటువంటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం జగన్ పర్యటనల్లో చాలా చోట్ల పొలాల్లో హెలిప్యాడ్‌లు నిర్మించేలా ఆదేశిస్తున్నారు. ఇలా సాగుభూముల్లో వీటిని నిర్మించడంతోపాటు, అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లే రహదారికి అనుసంధానం చేసేలా తాత్కాలిక రహదారి నిర్మాణం, ఆ రోడ్డుకు ఇరువైపులా బారికేడింగ్ తదితరాలన్నీ కలిపి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు వ్యయమవుతోంది.