ఒక్క ఓటమి జనసైనికులను ఆపలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని... విజయం సాధించే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విశాఖ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు. తన జీవితం రాజకీయాలకు అంకితమని... చివరి శ్వాస వరకు జనసేనను మోస్తానని చెప్పారు.
25 సంవత్సరాల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్... ఓడితే తట్టుకోగలనా... లేదా అని పరీక్షించుకున్న తర్వాతే పార్టీ స్థాపించానని స్పష్టం చేశారు. తనను శాసనసభలో అడుగుపెట్టనీయకూడదనే ఉద్దేశంతో... భీమవరంలో ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ, జడ్పీ, మునిసిపల్ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థులను నిలుపుతామని స్పష్టం చేశారు.