న్యాయం కోసం పోరాడుతున్న రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవటంపై జనసేనాని పవన్‌కల్యాణ్... ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట .... పవన్ కల్యాణ్, సోదరుడు నాగబాబు నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గేట్ వద్ద నిలిపేసి... పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. పోలీసుల తీరును నాగబాబు ఖండించారు. మహిళలపై లాఠీఛార్జీ చేయటం దారుణమన్నారు.
వైకాపాకు విశాఖపై ప్రేమలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. స్థిరాస్తి వ్యాపారం కోసమే విశాఖ పరిపాలన రాజధాని అంటున్నారని విమర్శించారు. ప్రశాంతమైన విశాఖలో ఫ్యాక్షన్ పడగలు విప్పేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయం నుంచి రాజధాని గ్రామాలకు వెళ్లనీయకపోవడం దారుణమన్నారు. అమరావతిని తరలించడం సాధ్యం కాదన్న పవన్.. రాజధానిని 5 కోట్ల మంది ఆమోదించాక తరలింపు అవసరమేంటని ప్రశ్నించారు. రాజధాని కదిలినా అది తాత్కాలికమే అని తెలిపారు. రాజధాని మార్పు నిర్ణయంతో వైకాపా వినాశనం మొదలైందని పవన్ అన్నారు.