గుంటూరు జిల్లా వరితో పాటు వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. డెల్టాలో ఎక్కువగా వరి పండిస్తుంటే.. మిగతా ప్రాంతాల్లో వాణిజ్య పంటలైన మిరప, పత్తి సాగు చేస్తుంటారు. చిలకలూరిపేట ప్రాంతంలో మెట్ట భూములు ఎక్కువగా ఉండటంతో రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా కావూరు గ్రామంలో అంకమ్మ చౌదరి స్ఫూర్తితో కొందరు రైతులు మెట్ట భూముల్లో వరిసాగు చేస్తున్నారు. నీటి అవసరం లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. వెద పద్ధతిలో విత్తనాలు పొలంలో చల్లుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించారు. మారుతున్న సాంకేతిక పద్ధతులు అనుసరించి భూసారాన్ని కాపాడటంతో పాటు మేలైన దిగుబడులు సాధిస్తున్నారు.
బంధువు ఇచ్చిన సలహాతో ..
కావూరు గ్రామానికి చెందిన కందుల అంకమ్మచౌదరి డిగ్రీవరకు చదువుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సాగుపై మక్కువతో వ్యవసాయం చేశారు. మొదట్లో వాణిజ్యపంటలు సాగుచేసి నష్టపోయిన అంకమ్మ చౌదరి.. ఓ బంధువు ఇచ్చిన సలహాతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాడు. గత ఐదేళ్లుగా నాటు రకాలైన నవారా, రత్నచోడి, గంధశాలా, కాలాబట్టి, కృష్ణవ్రీహి, కరిగజవల్లి తదితర వరి రకాలను సాగు చేస్తున్నారు. అయితే ఇతను సాధిస్తున్న ఫలితాలను చూసి.. గ్రామంలోని మరికొంత మంది రైతులు ఇదే బాటలో నడుస్తున్నారు.
ప్రస్తుత విధానంలో ఎకరాకు 15 నుంచి 20 బస్తాల దిగుబడి వస్తోంది. విత్తనాలు, ప్రకృతి సేద్యానికి సంబంధించి ఘనజీవామృతం, కోతకూలి, నూర్పిడికి కలిపి మొత్తం 15వేల వరకూ ఖర్చవుతోంది. ఖర్చులు పోగా ఎకరాకు 40వేల రూపాయల నుంచి 50వేల వరకు ఆదాయం వస్తోంది. అంతేకాకుండా పశువులకు మేతా లభిస్తోంది. నాలుగు నెలల్లో పంట చేతికిరాగానే వెంటనే రెండోపంటగా కొర్రలు, అరిగెలు, సామలు సాగుచేస్తున్నారు. వాటిమీద ఎకరాకు 10వేల నుంచి 15వేల రూపాయ ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతున్నారు.