NRI Yash Bodduluri Into Custody in Hyderabad Airport :సామాజిక మాధ్యమాల్లో యష్‌గా సుపరిచితుడైన, తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్)ని హైదరాబాద్ విమానాశ్రయంలో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు. తమ వెంట రావాలని చెప్పారు. తల్లికి బాగాలేకపోతే చూసేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. అనంతరం అదుపులోకి తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద యష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. 2024 జనవరి 11న తిరుపతి సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.
AP CID Took NRI Yashasvi Into Custody :వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేశారు. వృత్తి రీత్యా యశస్వి అమెరికాలో ఉంటున్నారు. పోలీసుల చర్యను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత జయరాం కోమటి తీవ్రంగా ఖండించారు. చివరి వంద రోజుల్లోనైనా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమో అని భావించిన ప్రవాసాంధ్రుల ఆశలను వమ్ము చేస్తూ జగన్ ప్రభుత్వం తన వక్ర బుద్ధిని కొనసాగిస్తోందని విమర్శించారు. యష్‌ను అక్రమంగా అదుపులోని తీసుకోవడాన్ని అమెరికాలోని ఎన్నారైలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారని అన్నారు. వెంటనే అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని నగరాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.
అరెస్టుల రాజ్యం అంతులేని అరాచకపర్వం - వైసీపీ ప్రభుత్వం ఏం చేద్దామనుకుంటోంది?
TDP Leaders Fires on YSRCP Government :ప్రవాసాంధ్రుడు యష్‌ను అదుపులోకి తీసుకోవడంపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఒక ఉగ్రవాదిని హింసించినట్లు యష్ పట్ల సీఐడీ వ్యవహరించటం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రవాసాంధ్రుడు యష్‌ని అక్రమ కేసులో అరెస్టు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ప్రభుత్వం క్రూరంగా అణచివేయాలనుకుంటోందని మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.