ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కల్లోలం... కనుమరుగవుతున్న మానవత్వం

కరోనా సృష్టిస్తున్న కల్లోలం మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఉన్నా.. అన్నీ ఉన్నా పాజిటివ్‌తో చనిపోయిన వారి వద్దకు వచ్చే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు సైతం కొవిడ్‌ మృతదేహాల అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా సోకి మృతి చెందిన వ్యక్తులు అన్నీ ఉన్నా అనాథల్లా మిగులుతున్నారు. ఆపదలో ఆదుకోక పోయినా బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు.

corona in guntur
corona in guntur

By

Published : May 5, 2021, 2:18 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలేనికి చెందిన ఓ మహిళ ఇటీవల కరోనాతో మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటి నుంచి కొద్ది దూరంలో ఉన్న శ్మశానానికి తరలించటానికి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ మాట్లాడుకున్నారు. దాని నిర్వాహకులు రూ.25 వేలు డిమాండ్‌ చేశారు. చేసేదేమి లేక నగదు చెల్లించి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.

చిలకలూరిపేటలోని గౌడవీధికి చెందిన ఓ యువకుడు నాలుగు రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో పడక దొరక్క అంబులెన్స్‌లో తిరుగుతూ అందులోనే మృతిచెందాడు. అదే అంబులెన్స్‌లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. అంబులెన్స్‌లో తిరిగినందుకు రూ.30వేలు చెల్లించారు. అంత్యక్రియలకు రూ.35వేలు చెల్లించాల్సి వచ్చింది.

వినుకొండకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యుడు ముందుగానే ఆ వ్యక్తి బంధువులకు ఆక్సిజన్, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు తెచ్చుకుంటేనే పడక ఇస్తామని చెప్పారు. దాంతో వారు చేసేదేమి లేక ఆక్సిజన్‌ సిలిండర్‌కు రూ.20 వేలు, రెమిడెసివర్‌ ఇంజక్షన్లకు రూ.లక్షకు పైగా బ్లాక్‌మార్కెట్‌లో నగదు చెల్లించి తెచ్చుకున్నారు. ఇలాంటివి కరోనా బాధితులకు నిత్యకృత్యంగా మారాయి.

యడ్లపాడులో కరోనా పాజిటివ్‌ రోగిని ఇంటి నుంచి అంబులెన్స్‌లో తీసుకెళ్లాలి. ప్రైవేటు అంబులెన్స్‌ వారు అధిక మొత్తంలో నగదు డిమాండ్‌ చేస్తున్నారు. కొద్ది దూరానికే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరితే ఆక్సిజన్, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు తెచ్చుకోవాల్సి వస్తుండడంతో వాటికి కూడా రూ.వేలు వెచ్చించాల్సిన పరిస్థితి బాధిత కుటుంబాలలో కల్లోలం రేపుతోంది. తీరా ఆసుపత్రిలో ప్రాణాలు పోతే మళ్లీ అంబులెన్స్‌లో తరలించాలన్నా, శ్మశానంలో అంత్యక్రియలు చేయాలన్నా కనీసం సాయం చేయాలన్నా బాధ్యతను మరిచి బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు.

శ్మశాన వాటికల వద్ద మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే సాధారణంగా ప్రతిచోట రూ.4వేల నుంచి రూ.5వేల వరకు తీసుకుంటారు. అందులోనే కట్టెలు, కూలీ అన్ని కలిపి ఉంటాయి. ప్రస్తుతం కరోనా భయంతో కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాకపోతుండడంతో చివరికి శ్మశాన వాటికల వద్ద కూడా గతంలో చెలించాల్సిన రూ.4 వేల నుంచి రూ.5 వేలతో పాటు అదనంగా అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ మృతుల అంత్యక్రియలకు పీపీఈ కిట్లు ధరించినా రూ.వెయ్యికి మించి ఖర్చు కాదు. కానీ రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు బాధిత కుటుంబాల నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. శ్మశాన వాటికల వద్ద గతంలో నిర్ణయించినట్లుగా అంత్యక్రియలకు నగదు తీసుకునేలా నగరపాలక, పురపాలక, పంచాయతీలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆదుకోవాల్సిన తరుణంలో..


బాధితులను ఆసుపత్రికి చేర్చడానికి అంబులెన్స్‌ నిర్వాహకులు సాధారణ రోజుల్లో కేవలం రూ.5 వేలు తీసుకునే దూరానికి ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నారు. రూ.10 వేలు చెల్లించే దూరానికి రూ.30వేల నుంచి రూ.35 వేలు వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేయటానికి రూ.వేలు ఖర్చు అవుతుందని సాకులు చెబుతున్నారు. వాస్తవానికి 7 క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యమున్న రీఫిల్‌ను ఫిల్‌ చేయటానికి రూ.900 నుంచి రూ.1000 మాత్రమే ఖర్చు అవుతోంది. కానీ గతం కన్నా 2 నుంచి 3 రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుత ఆపద కాలంలో మానవతా ధృక్పథంతో ఆలోచించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దూరాన్ని బట్టి అంబులెన్స్‌లకు ధరలు నిర్దేశించి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

నల్లబజారులో అధిక ధరలు


ఆక్సిజన్, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల కొరత కారణంగానే అక్రమార్కులు వాటిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. కొవిడ్‌ ఆసుపత్రులకు రెమ్‌డెసివర్‌ ప్రభుత్వం సరఫరా చేస్తే ఒక్క ఇంజక్షన్‌కు రూ.3600 ఖర్చు అవుతుంది. ఇలా కోర్సు ఆరు ఇంజక్షన్లు వాడటానికి రూ.21,600 ఖర్చు అవుతుంది. కానీ, బ్లాక్‌ మార్కెట్‌లో రూ.లక్షకు పైగా చెల్లించి ఆరు ఇంజక్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కొవిడ్‌ బాధితులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించి అన్ని కొవిడ్‌ ఆసుపత్రులకు అవసరమైన మేర ఆక్సిజన్, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు సరఫరా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఇదీ చదవండి:

తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్‌ మ్యూటెంట్ వైరసే

ABOUT THE AUTHOR

...view details