నేటి నుంచే....ఎయిమ్స్ ఓపీ సేవలు గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ఓపీ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఎయిమ్స్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనరల్, మెడిసిన్, జనరల్ సర్జరీతో సహామొత్తం 13 విభాగాల్లో ఔట్ పేషెంట్లకు వైద్యసేవలు అందనున్నాయి. రోగుల తాకిడికి అనుగుణంగా అధునాతన క్యాంటీన్, అమృత ఫార్మసీ, హింద్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్రం కేటాయించిన ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ వైద్యసంస్థపై అందరిదృష్టి కేంద్రీకృతమైంది. 1680 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్టుకు 2015 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. ఎయిమ్స్ నిర్మాణానికి 183 ఎకరాల భూమిని రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది.ఎయిమ్స్ కు అవసరమయ్యే తాగునీరు, రహదార్లు, విద్యుత్తు సదుపాయాన్ని రాష్ట్రప్రభుత్వం కల్పిస్తుంది. వెయ్యికిపైగా బెడ్స్ సామర్థ్యంతో ఎయిమ్స్ ను నిర్మించనున్నారు. మొదటి దశ పనుల్ని దాదాపు 90 శాతం మేరకు పూర్తి చేశారు. ఓపీ బ్లాక్, విద్యార్థుల వసతిగృహాలు, స్టాప్ క్వార్టర్లు దాదాపు పూర్తియ్యాయి.601 కోట్ల రూపాయలతో రెండో దశ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈదశలో ప్రధాన ఆస్పత్రి, మెడికల్, నర్సింగ్ వైద్య కళాశాల భవనాలనుఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తోంది. ఇవన్నీ వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మంగళగిరి ఎయిమ్స్ లో తొలివిడతగా 50 మంది విద్యార్థుల కోసం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. రెండో దశ పనులు 2020 నాటికి పూర్తయితే ఎయిమ్స్ ద్వారా సంపూర్ణంగా సేవలందే అవకాశముంది.