National Agricultural Education Day in AP: గుంటూరు లాం ఫామ్‌లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన అగ్రిటెక్ ప్రదర్శన పాఠశాల విద్యార్థులతో కళకళలాడింది. డిసెంబర్ 3న జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం కావటంతో విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. పైగా ఇవాళ్టి నుంచి లాం ఫామ్‌లో అగ్రిటెక్-2022 ప్రదర్శన కూడా ప్రారంభమైంది. వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనతో పాటు ఇక్కడి పొలాలు, పంటల సాగు గురించి పాఠశాల విద్యార్థులకు వివరించేందుకు వారిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో చాలామందికి అన్ని రకాల పంటల గురించి తెలియదు. వాటి గురించి పిల్లలు ఆసక్తిగా తెలుసుకున్నారు. వ్యవసాయ విధానాలు, వివిధ రకాల పంటలు, వ్యవసాయ విద్యా కోర్సుల గురించి అధికారులు అవగాహన కల్పించారు. తద్వారా విద్యార్థులకు వ్యవసాయం పట్ల, రైతుల కష్టనష్టాల పట్ల గౌరవం పెరుగుతుంది. అలాగే వారిలో కొందరైనా భవిష్యత్తులో వ్యవసాయ విద్య వైపు వస్తారని అధికారులు భావిస్తున్నారు. లాంఫాం సందర్శనపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.