Nara Lokesh Fires on CM YS Jagan: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక జగన్మోహన్ రెడ్డి ముందు చూపు కుట్ర దాగి ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది, పేదలు ధనికులుగా మారితే, జగన్మోహన్ రెడ్డి ఎవర్ని దోపిడీ చేయగలడని ధ్వజమెత్తారు. సురక్షితమైన శాంతి భద్రతల విధానంలో వైసీపీ మద్దతుదారులు మహిళలపై ఎలా దాడులు చేస్తున్నారని నిలదీశారు. యువతకు ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు లభిస్తే.. చీప్ లిక్కర్, అక్రమ మాదక ద్రవ్యాల లభ్యతపై ఎవరు ఆధారపడతారని ప్రశ్నించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ పురోగతికి కారణమైన దార్శనికత గల నాయకుడిని జైలులో పెట్టారని మండిపడ్డారు.
నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని లోకేశ్ ధ్వజమెత్తారు. సీఎంగా జగన్ చేసిన మంచి పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. అసలే సైకో అయిన జగన్‌కి అధికారమదం ఎక్కిందని మండిపడ్డారు. ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరిందని స్పష్టం అవుతోందని ఎద్దేవా చేశారు. లోటు బడ్జెట్‌తో ఏర్పడిన నవ్యాంధ్రని ఏ లోటూ లేకుండా అభివృద్ధి-సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకా 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబు అక్రమ అరెస్టు చేసి, నెలరోజులుగా వ్యవస్థలని మేనేజ్ చేసి మరీ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు పిచ్చి జగన్ అంటూ ప్రశ్నించారు.
Nara Brahmani Comments: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబుని జైల్లో పెట్టారా అని లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు ప్రజలకోసం తలపెట్టిన పనులు వీటినే నేరాలు అంటున్నారని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు చూస్తుంటే ఏపీని అభివృద్ధి చేసినందుకే ఆయన్నిఅరెస్టు చేసి జైల్లో పెట్టినట్టు ఉందని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయం దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అంతా గ్రహించాలని కోరారు.