Minister Suresh on holidays for EDUCATIONAL INSTITUTIONS: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ఏదీ లేదని... ఇంతకుముందు ప్రకటించినట్లే సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ‘ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. 15-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 92% మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను యథావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రతపై డేగకన్నుతో నిఘా ఉంచింది. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పాఠశాలలు నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని మంత్రి వివరించారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని, భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని విద్యామంత్రి వెల్లడించారు.
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు 30 వరకు పొడిగింపు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో వైద్యకళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ నెల తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఆదివారంతో ఈ గడువు ముగిసింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా ఉద్ధృతి..
Corona cases in India: మరోవైపు భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు. కొత్తగా.. 2,71,202 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 314 మంది మరణించారు. 1,38,331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:37,122,164
- మొత్తం మరణాలు:4,86,066
- యాక్టివ్ కేసులు:15,50,377
- మొత్తం కోలుకున్నవారు:3,50,85721
అంతర్జాతీయంగా..
corona cases in world:ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 20 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే 23,53,411 మందికి వైరస్ అంటుకోగా.. 5,605 మంది మృతి చెందారు. ఇందులో దాదాపు 40 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
- అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తూ రోజుకు లక్షల మందికి అంటుకుంటోంది. శనివారం ఒక్కరోజే 4,02,735 కొత్త కేసులు వెలుగు చూశాయి. 882 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసులు 66,662,877, మరణాలు 8,73,145కు చేరాయి.
- ఫ్రాన్స్‌లో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. డెల్టాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఓ కొత్త వేరియంట్‌ను గుర్తించటం కలకలం సృష్టిస్తోంది. శనివారం మరో 324,580 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 148 మంది మృతి చెందారు. 27వేల మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,894,255, మరణాలు 126,869కి చేరాయి.
- ఇటలీలో వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1,80,426 మందికి వైరస్ సోకింది. 239 మంది మరణించారు. 1,25,199 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 120,609కు చేరింది.
- ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 1,03,836 మందికి వైరస్ సోకగా.. 55 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,640, 386కు చేరింది.
- అర్జెంటీనాలో కొవిడ్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 96,652 మందికి వైరస్ సోకింది. 88 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసులు 7,029,624కు చేరాయి.
- బ్రిటన్‌లో కొత్తగా 81,713 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 287 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1.5 కోట్లు దాటింది.
- టర్కీలో 63వేలు, జర్మనీలో 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. బ్రెజిల్, రష్యా, కొలంబియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, బెల్జియం వంటి దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజుకు దాదాపు 30వేలకుపైగా కొత్తగా వైరస్ బారినపడుతున్నారు.
ఇదీ చదవండి
Fire Accident: సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.20 కోట్ల ఆస్తినష్టం!