MINISTER BOTSA ON HIGH COURT JUDGEMNET: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో వచ్చిన తీర్పు ఊహించిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. న్యాయస్థానం అనుమతి ఇస్తే పాదయాత్ర చేసుకోవచ్చని.. అందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్ర అని విమర్శించారు. జనవాణి 26 జిల్లాల్లో కాకపోతే.. ఒడిశా ఇతర రాష్ట్రాల్లో కలిపి 56 జిల్లాలో చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కాపు నేతల సమావేశం విజయవాడలో మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు. తెదేపా సైతం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవచ్చని.. తప్పులేదన్నారు.
ప్రతిదీ ప్రజలనడిగి చేయలేము: తమ ప్రభుత్వ విధానాలు బాగోపోతే తామే ఎన్నికల్లో నష్టపోతామని.. ప్రతిదీ ప్రజలను అడిగి చేయలేమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అర్ధరాత్రి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజల్ని అడిగే చేశారా అని ప్రశ్నించారు. 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలన్న మోదీ.. పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయట్లేదని నిలదీశారు. నాడు-నేడు ఓ అద్భుత కార్యక్రమమేమీ కాదన్న మంత్రి.. పాఠశాలల పరిస్థితి గతంలో ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందని చెప్పే ప్రయత్నం మాత్రమే అని తెలిపారు.