ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు.. వ్యతిరేకించిన మరో నాలుగు గ్రామాలు - మంగళగిరి మండలం

Amaravati Municipality: అమరావతి పురపాలిక ఏర్పాటును ఒప్పుకోబోమని ఐదో రోజు.. మరో నాలుగు గ్రామాలు తేల్చిచెప్పాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయాల్సిందేనని అభిప్రాయ సేకరణలో ప్రజలు స్పష్టం చేశారు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా చేసే పనులను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పారు.

Krishnaiahpalem
కృష్ణయపాలెం గ్రామ సభ

By

Published : Sep 16, 2022, 3:22 PM IST

Updated : Sep 16, 2022, 9:08 PM IST

Against Amaravati Municipality: 22గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలనే వైకాపా ప్రభుత్వ ప్రయత్నాలకు అడుగడుగునా తిరస్కారమే ఎదురవుతోంది. రాజధాని గ్రామాల్లో ఐదో రోజూ అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో మరో నాలుగు ఊర్లు అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటును వ్యతిరేకించాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అధికారులు గ్రామ సభ నిర్వహించగా.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఓటు వేశారు. తమకు మున్సిపాలిటీ వద్దని.. అమరావతి అభివృద్ధే ముఖ్యమని ముక్త కంఠంతో చెప్పారు. ముఖ్యమంత్రి కుయుక్తులతో అమరావతిని నాశనం చేసేందుకే మున్సిపాలిటీలో కలిపేలా కుట్రపన్నారని మండిపడ్డారు.

తుళ్లూరు మండలం వెలగపూడిలోనూ ప్రభుత్వ ప్రతిపాదనను ప్రజలు మూకుమ్మడిగా తిరస్కరించారు. 29 గ్రామాల సంపూర్ణ అమరావతి తప్ప దేనికీ అంగీకరించబోమని అధికారులకు స్పష్టం చేశారు. మల్కాపురం, పెదపరిమిలోనూ ప్రభుత్వ ప్రతిపాదనకు తిరస్కారమే ఎదురైంది. మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పడంలో విఫలమైనందున.. వ్యతిరేకంగా చేతులెత్తామని స్థానికులు వెల్లడించారు.

మున్సిపాలిటీ వద్దని.. 29 గ్రామాల సంపూర్ణ అమరావతి కావాలని నాలుగు గ్రామాల్లో ప్రజలు తేల్చిచెప్పారు. తమ సందేహాలను నివృత్తి చేశాకే మళ్లీ గ్రామ సభ నిర్వహించాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

అమరావతి పురపాలిక ఏర్పాటును తిరస్కరించిన మరో నాలుగు గ్రామాలు

ఇవీ చదవండి:

Last Updated : Sep 16, 2022, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details