Lokesh Reacted on CID Enquiry: "సీఐడీ విచారణకు తప్పకుండా హాజరవుతా.. తప్పుడు కేసులకు ఆధారాలు చూపాలి" Lokesh Reacted on CID Enquiry:ప్రభుత్వం కక్షసాధింపుతోనే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని లోకేశ్ ఆరోపించారు. ఆధారాలు లేని కేసులతో ఇబ్బందిపెట్టాలని చూస్తోందన్నారు. తామ కుటుంబం ఎప్పుడూ తప్పు చేయదన్న లోకేశ్.. సీఐడీ విచారణకు ధైర్యంగా హాజరవుతానన్నారు. తాను దిల్లీలోనే ఉన్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. ఏనాడు ఏ తప్పు చేయలేదని, చేయమని నారా లోకేశ్ అన్నారు. ఒకవేళ తాను తప్పు చేస్తే.. మొదట చంద్రబాబే తనని జైలుకు పంపుతారని గతంలోనే చెప్పానన్నారు. 8 ఏళ్లుగా స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటిస్తున్నామని.. అంతకు మించి ఒక్క రూపాయి ఉన్నా, గజం స్థలం ఉన్నాయని నిరూపించినా అవన్నీ ప్రభుత్వానికి రాసిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డే నిర్మించలేదని.. ఇందులో డబ్బులు చేతులు మారడం, కుంభకోణం జరగడం ఎలా ఉంటుందన్నారు. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 9.65 ఎకరాల భూమి.. అమరావతి కోర్ కేపిటల్ నుంచి 40 కిలోమీటర్లు, జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు అక్కడ డెయిరీ ప్లాంట్ పెట్టేందుకే హెరిటేజ్ సంస్థ ఆ భూమి కొనుగోలు చేసిందన్నారు.
మోత మోగిన ఆంధ్రప్రదేశ్... రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన చంద్రబాబు అభిమానులు
మంత్రి కావడానికి ముందే హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని ప్రస్తుతం అందులో వాటాదారును మాత్రమేనన్నారు. సంస్థ రోజువారీ కార్యకలాపాలు, బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు ఆ సంస్థ డైరెక్టర్లకు తెలుస్తాయి తప్ప తనకు ఎలా తెలుస్తాయన్నారు. త్రైమాసిక, వార్షిక ఫలితాలు మాత్రమే తనకు ఇస్తారన్నారు. సీఐడీ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మేం ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టి దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపారు.
"ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. రోడ్డే అవలేదు. కానీ, ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని చిత్రికరించటానికి ప్రయత్నిస్తున్నారు. మా సొంత ఇళ్లు మా పేరు పైన ఉన్నాయి. కంపెనీ పేరు మీద లేవు.. జగన్ లాగా. జగన్ నివసిస్తున్న హైదరాబాద్ ఇల్లు కానీ, కడప ఇల్లు, తాడేపల్లి కొంప కూడా సొంత పేరుపై ఉండదు." - లోకేశ్
Break For yuvgalam with CID Cases : యువగళం జోరందుకున్న వేళ.. 'సీఐడీ స్కిల్' కేసులతో సర్కారు అస్త్రం
ఈనెల 4న సీఐడీ విచారణకు తప్పకుండా హాజరవుతానన్న లోకేశ్.. వాళ్లలా వాయిదాలు అడేగి అలవాటు తమకు లేదన్నారు. జగన్, ఆయన సహచరులు వారి కేసుల నుంచి తప్పించుకోవడానికి 2వేల సార్లు వాయిదాలు అడిగారు. పదేళ్లుగా బెయిల్‌పై బతుకుతున్నారు. జగన్, విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. మాకు ఆ అవసరం లేదన్నారు. తమపై పెట్టిన కేసులన్నీ దొంగకేసులేనని తాము తప్పు చేసి ఉంటే ఈపాటికే ఆధారాలు చూపేవారన్నారు.
వ్యక్తిగత, కంపెనీల ఖాతాలకు డబ్బులు వచ్చి ఉంటే చూపించాలన్నారు. అవేమీ లేవు కాబట్టే వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న లోకేశ్ దిల్లీలోనే ఉన్నానన్నారు. తాను సింగపూర్ పోయానని ప్రచారం చేసిన రోజు రాష్ట్రపతిని కలిశానన్నారు. సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వాళ్లలాగా తల్లిని ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేయలేదన్నారు.
Vijayawada Engineering Students With CBN : 'అడుగడుగునా పోలీసు జులుం'.. ఏపీలో ఎమర్జెన్సీ పెట్టారా..?: లోకేశ్ ఫైర్
స్కిల్, ఇన్నర్‌రింగ్‌రోడ్డు, ఫైబర్‌గ్రిడ్ కేసులు తనపై పెట్టారన్న లోకేశ్.. ఈ మూడు ప్రాజెక్ట్‌లు తాను పనిచేసిన శాఖల కిందకు రావన్నారు. ఫైబర్‌గ్రిడ్‌కు సంబంధించి నాటి ఐటీ సెక్రటరీని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దిల్లీకి పిలిస్తే ఆయన ప్రయాణ అనుమతి కోసం ఓ ఫైల్ మాత్రమే తన వద్దకు వచ్చిందని గుర్తుచేశారు. అంతకు మించి ఏఫైళ్లూ తన వద్దకు రాలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తోందన్న లోకేశ్.. అందుకే ఆధారాలు లేని కేసులు పెడుతున్నారన్నారు. కనీసం అసెంబ్లీలో కూడా ఒక్క ఆధారం చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.
డబ్బులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డి, అజేయకల్లం ఈ కేసులో ఎక్కడా కనిపించకపోవడం విచిత్రమన్నారు. దానికి సీఐడీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీఐడీ వైసీపీ అనుబంధ విభాగంలా మారిపోయిందన్నారు. తాను దిల్లీ వస్తే కనిపించడం లేదని సీఐడీ ప్రచారం చేయడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నోటీసులిచ్చేందుకు వచ్చిన అధికారులను నిలదీశారు. ఈ వదంతులను ఖండించకపోతే దర్యాప్తు అధికారి, డీజీపీపైన న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
CID Issued a Notice to Nara Lokesh: నారా లోకేష్‌కు వాట్సాప్ ద్వారా నోటీసు పంపిన సీఐడీ