అభివృద్ధిలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే ప్రస్తుత సీఎం జగన్ శ్రీలంకను అనుసరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో పర్యటించిన లోకేశ్.. కరోనాతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న కుటుంబాలను పరామర్శించిన ఆయన.. బాధితులకు న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబుకు సింగపూర్ ఆదర్శమైతే.. జగన్ శ్రీలంకను అనుసరిస్తున్నారు: లోకేశ్ - లోకేశ్ తాజా వార్తలు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. కురగల్లులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న కుటుంబాలను పరామర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచిపెట్టారు. ప్రభుత్వం వసూలు చేస్తున్న వివిధ పన్నులపై లోకేశ్ కరపత్రాలు పంచారు.
లోకేశ్ గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడటంతో లాంతర్ సాయంతో తన పర్యటనను కొనసాగించారు. చంద్రబాబు మహిళలకు పసుపు, కుంకుమ ఇస్తే.. జగన్ వాటిని తుడిచేస్తున్నారని ఆరోపించారు. 'బాదుడే..బాదుడు' అంటూ విద్యుత్, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితి తీసుకొచ్చారంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు అభివృద్ధిని వదిలేశారని.. ఇక రాబోయే మంత్రులు ఏం చేస్తారో చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచిపెట్టారు. ప్రభుత్వం వసూలు చేస్తున్న వివిధ పన్నులపై లోకేశ్ కరపత్రాలు పంచారు. చంద్రబాబు తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టం వల్లే కురగల్లులో బాధితుల ఇళ్లు తొలగించకుండా ఆగిందని న్యాయవాది ఇంద్రనీల్ చెప్పారు.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి ఆదాయార్జన ఎంత కష్టమో అందరికీ తెలుసు: మంత్రి బుగ్గన