Loan Apps Fraud : డిజిటల్ రుణ యాప్‌ల ఆగడాలు ఇటీవల కాలంలో హెచ్చుమీరుతున్నాయి. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేని వారిని యాప్ నిర్వాహకులు.. మానసికంగా వేధిస్తున్నారు. రుణాలు తీసుకుని చెల్లించలేని వారు.. రుణ యాప్‌ల బ్లాక్ మెయిలింగ్‌ను భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
యాప్ డౌన్‌లోడ్ చేసి వివరాలు పొందుపరిస్తే చాలు.. క్షణాల్లో లోన్ ఇస్తామంటూ రుణ యాప్ నిర్వాహకులు మొదట్లో ఆకర్షిస్తున్నారు. వారి మాటలు నమ్మి వివరాలు నమోదు చేసి లోన్ తీసుకున్న తర్వాత.. వారి ఆగడాలను బయట పెడుతున్నారు. ఇచ్చిన డబ్బు కంటే రెట్టింపు వసూలు చేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బు కట్టలేని వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల గొల్లపూడికి చెందిన ఓ యువకుడు రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"పదో తేదీన మా ఖాతాలో నగదు జమా చేశారు. మళ్లీ 23 వ తేదీన తిరిగి చెల్లించమని ఫోన్ చేశారు. అప్పుడు అడిగిన మొత్తం వారికి తిరిగి చెల్లించాము. మళ్లి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి ఇంకా కొన్ని డబ్బులు చెల్లించమని ఫోన్ చేశారు. నగదు లేవని చెప్పటంతో అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తున్నారు." -దేవి, బాధితురాలు