'లైమ్ స్టోన్ సిటీ'గా పేరున్న గుంటూరు జిల్లా పిడుగురాళ్ల.. సున్నం ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పేరొందింది. ఇక్కడ తయారైన సున్నం 5 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సరఫరా అవుతోంది. పిల్లుట్ల రోడ్డులో సున్నం తయారీ కోసం 300 బట్టీలుండేవి. ఇక్కడ నుంచి పంచదార పరిశ్రమలు, రసాయనిక పరిశ్రమలు, పేపర్ మిల్లులకు 150 లారీల సున్నపు బస్తాలు ఎగుమతయ్యేవి. మరో 100 లారీలు సెమ్ పౌడర్‌గా మిగిలినవి చేపల చెరువులు, హోలీ బ్రిక్స్ పరిశ్రమకు వినియోగించేవారు.
ఈ పరిశ్రమలలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందేవారు. రాజస్థాన్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు వంటి మిగతా రాష్ట్రాలు కూడా సున్నం ఉత్పత్తి చేయడంతో కొన్నాళ్లుగా ఆశించిన స్థాయిలో వ్యాపారం ఉండటం లేదు. ఏటా బట్టీల సంఖ్య తగ్గిపోతుండటంతో వీటినే నమ్ముకున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బట్టీల్లో ముడిరాయిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చితే సున్నపురాయిగా మారుతుంది. అయితే నాణ్యమైన బొగ్గు లేకుండా సున్నపు రాయిని కాల్చే అవకాశం లేదు. నాణ్యమైన సున్నం ఉత్పత్తికి ఝరియా బొగ్గు వాడుతుండగా దీని ధర ఆకాశన్నంటిందని నిర్వాహకులు చెబుతున్నారు. పెట్రో కోక్ నుంచి వచ్చిన బొగ్గు ధరలు కూడా పెరగడంతో బట్టీల నిర్వహణ కష్టంగా మారిందని అంటున్నారు.