శైవక్షేత్రాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేకస్థానం. ఇక్కడ శివయ్య.. త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూఠాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల విశ్వాసం. ఈశ్వరుడు కైలాసాన్ని విడిచి.. ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఈ కొండలపైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేశారని భక్తుల నమ్మకం. 3 కొండలపై త్రిమూర్తుల విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వరస్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్రశిఖరంపై పాత కోటేశ్వరస్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధో దక్షిణమూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతి యాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను కట్టిపడేస్తాయి.
కోటప్పకొండ ఉత్సవాల్లో విద్యుత్ ప్రభలు ప్రత్యేకతను చాటుతాయి. రాష్ట్రంలో మరెక్కడా కన్పించని విధంగా 80 నుంచి 100 అడుగుల ఎత్తున భారీ విద్యుత్ ప్రభలు శివరాత్రి వేళ భక్తులకు కనువిందు చేస్తాయి. ఏటా శివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
కోటప్పకొండ ఆధ్యాత్మికంగానే కాదు... పర్యాటక, పర్యావరణ క్షేత్రంగానూ అభివృద్ధి చెందింది. సహజ అందాలు మరో ఎత్తు. భక్తుల తాకిడి దృష్ట్యా.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే రోడ్డుమార్గాలను వెడల్పు చేశారు.