KCR Welcomed the President in Hakimpet: శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. హకీంపేట వైమానిక స్థావరంలో ముర్ముకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, మేయర్, అధికారులు, త్రివిధ దళాధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఉదయం ఉదయం 10 గంటల 40 నిమిషాలకు భారత వాయిసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హెలికాఫ్టర్లో శ్రీశైలం వెళ్లారు. సాయంత్రం 5గంటల సమయంలో రాష్ట్రపతి తిరిగి హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకున్నారు.
ముర్ము వెంట గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్రపతి యుద్ధ వీరుల స్మారకం వద్ద అమరులకు అంజలి ఘటించిన అనంతరం బొల్లారంలోని తన నిలయానికి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం తన గౌరవార్థం గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో ఏర్పాటు చేసిన విందుకు రాష్ట్రపతి ముర్ము హాజరవుతారు. ఈనెల 30 వరకు రాష్ట్రపతి బొల్లారంలోనే విడిది చేస్తారు. ఈ సమయంలో భద్రాచలం, రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శిస్తారు. హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.