Hundred years of Guntur Kamma Hostel: గుంటూరులోని ఆరండల్‌పేట 4/4లోని కమ్మ వసతి గృహం వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ ఉండి ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చలనచిత్రం రంగం నుంచి గుమ్మడి వెంకటేశ్వరరావు, యలవర్తి నాయుడమ్మ, గుండెజబ్బు నిపుణులు పిడికిటి లక్ష్మణరావు, రాజకీయాల నుంచి మోటూరు హనుమంతరావు, జీవీఎస్ ఆంజనేయులు, శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే వసతి పొందారు. రాష్ట్రంలో మరెక్కడా ఓ వసతి గృహం వందేళ్లు పూర్తి చేసుకోలేదు.
సత్రంగా మొదలై..ఈ వసతి గృహం ఆవిర్భావానికి ఎంతో చరిత్ర ఉంది. 1910 ప్రాంతంలో వివిధ పనులపై గుంటూరు వచ్చేవారికి లాడ్జిల సదుపాయం ఉండేది కాదు. మాచర్ల సమీపంలోని ఓబులేశుని పల్లెకు చెందిన శాఖమూరి వెంకట సాంబయ్య కోర్టు పనిపై వచ్చి రాత్రికి బస చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి వరండాలో నిద్రించాల్సి వచ్చేది. ఇంటికి వెళ్లి తాను అనుభవించిన బాధను సతీమణి లక్ష్మీదేవమ్మకు చెప్పారు. తర్వాత రోజే ఆమె గుంటూరు వచ్చి ఆరండల్ పేటలో 2 వేల 400 గజాల స్థలాన్ని కొని.. భవనాన్ని నిర్మించి.. దానికి కమ్మ సత్రం అనే పేరు పెట్టారు.
సత్రం కాస్త వసతి గృహంగా..
ఆనాడు గ్రామాల నుంచి గుంటూరు పట్టణానికి వచ్చే విద్యార్థులకు వసతి సదుపాయం దొరికేది కాదు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, జంపాల వెంకటేశం(కొత్త రఘురామయ్య మావయ్య) తదితర ప్రముఖులు లక్ష్మీదేవమ్మ కుమార్తె రాధాబాయమ్మ, అల్లుడు, గుంటూరు డిప్యూటీ కలెక్టర్ చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాద్‌లను ఒప్పించి 1923లో దానిని కమ్మ హాస్టల్‌గా నామకరణం చేశారు. ఇప్పటికీ కమ్మ హాస్టల్ భవనం రాధావిలాస్ పేరుతో ఉంది. చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాద్ విగ్రహం నేటికీ ప్రాంగణంలో ఉంది.