గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమానులో 13 ఏళ్ల క్రితం గురుకుల బాలికల పాఠశాల మంజూరైంది. పాఠశాల నిర్మించేందుకు అధికారులు స్థలం కేటాయించారు. అయితే ఆ భూమి తమదంటే తమదని రెవెన్యూ, దేవాదాయ శాఖలు కోర్టుల్లో కేసులు వేశాయి. ఆ వివాదంతో పాఠశాల నిర్మాణం ఆగిపోయింది. అప్పటినుంచి పాఠశాలను బాపట్లలో నిర్వహిస్తున్నారు.
వివాదం పరిష్కారం.. భవనం నిర్మాణం
గత ప్రభుత్వంలో సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న రావెల కిశోర్ బాబు 2 శాఖలతో మాట్లాడి భూ వివాదాన్ని పరిష్కరించారు. ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ. 13 కోట్ల నిధులతో పాఠశాల నిర్మించేందుకు 2016 జులై 9న ఆయన శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల, వసతి, బోజనశాల, ఉపాద్యాయులు ఉండేందుకు విశాలవంతమైన భవనాలు నిర్మించారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి మంత్రి నక్కా ఆనందబాబు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.