JANASENA MEMBERSHIP EXTENDED : జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సభ్యత్వ నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినందున కొందరు తమ పేర్లను నమోదు చేయించుకోలేకపోయారన్నారు. అందుకే గడువు పెంచాలని జన సైనికులు, వీర మహిళల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు మనోహర్ తెలిపారు. సభ్యత్వ నమోదు గడువును మార్చి 3వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పెంచాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జనసేన క్రీయాశీలక సభ్యత నమోదు కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఘనంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీకి చెందిన నాయకులు, క్షేత్రస్థాయిలో జనసైనికులు.. అధినేత పవన్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు వివరించారు. అలాగే సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పార్టీ తరఫున, పవన్ కల్యాణ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు.
"జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. కొన్ని అంశాలపైనా చాలా మంది మాకు ఫోన్ చేసి.. సాంకేతిక కారణాల వల్ల గత రెండు రోజుల నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. ఈ అంశాలను పరిశీలించిన పవన్ కల్యాణ్ మార్చి 3వ వరకూ గడవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు"-నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్