ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఒక్క హామీనీ ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో తెలుగు మహిళా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇంట్లో పిల్లలందరికీ అమ్మ ఒడి, 45 ఏళ్లకే పింఛన్, సంపూర్ణ మద్య నిషేధం వంటి అనేక హామీలను జగన్ బుట్టదాఖలు చేశారని లోకేశ్ మండిపడ్డారు. విద్యుత్, గ్యాస్, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేశారని దుయ్యబట్టారు. దిశ చట్టం ఎక్కడా అమలు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 నెలల్లో ఒక్క మహిళకు కూడా న్యాయం జరగలేదన్న లోకేశ్... వైకాపా నాయకులే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జై అమరావతి ఉద్యమంలో మహిళలు చూపిన పోరాట స్ఫూర్తి అన్ని జిల్లాలోనూ రావాలని పిలుపునిచ్చారు.
కష్టపడేవారికే పదవులు