- వరి సాగుకు కూలీల కొరత, పెట్టుబడి వ్యయం ఏటికేడు పెరగడంతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించే ప్రణాళిక ఉందా?
శాస్త్రవేత్త:వరి సాగు చేయడానికి ఎకరాకు సగటున 55 మంది కూలీలు అవసరం. దీంతో కూలీల కోసమే పెట్టుబడిలో 65శాతం రైతులు ఖర్చు చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి విత్తనం నుంచి నూర్పిడి వరకు యాంత్రీకరణ ఏకైక మార్గం. ఆరుతడి విధానంలో వరి సాగు చేసి చెరువుజమ్ములపాలెం రైతులు పెట్టుబడి తగ్గించే మార్గానికి నాంది పలికారు. ఈ విధానం అనుసరణీయంగా ఉండటంతో ఇందులో లోపాలు అధిగమించేలా కసరత్తు చేస్తున్నాం. ఈ విధానంలో సాగుచేసిన పంట తుపాను గాలుల దాటికి నేలవాలి, ధాన్యం మొలకెత్తి నష్టం జరుగుతోంది. గాలికి నేలవాలకుండా వేరు వ్యవస్థ గట్టిగా ఉండటంతోపాటు నీళ్లలో నానిన వెంటనే మొలక రాకుండా ఉండే వంగడాలను తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నాం. ఇప్పటికే రెండు వంగడాలు విడుదల చేశాం. అయితే ఇక్కడ సన్నరకాలపై ఆసక్తి చూపుతుండటంతో గాలికి కూడా పడని వంగడాలు వృద్ధి చేసి త్వరలోనే రైతులకు అందిస్తాం. దీనివల్ల హెక్టారుకు రూ.10వేలు సాగు వ్యయం తగ్గించి రెండేళ్లలో సుస్థిర వరి సాగు పద్ధతిని రైతులకు అందిస్తాం.
- బీపీటీ-5204 రకం వచ్చి 30ఏళ్లయినా ఇప్పటికీ అదే సాగులో ఉంది. ఈ రకానికి అగ్గితెగులు ఆశించి నష్టం జరుగుతోంది. దీన్ని అధిగమించే వంగడాలు అభివృద్ధి చేస్తున్నారా?
శాస్త్రవేత్త:డెల్టా ప్రాంతంలో బీపీటీ-5204 రకం ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది వర్షానికి, గాలులకూ నేలవాలి నష్టం జరుగుతోంది. అగ్గితెగులు వల్ల కూడా దిగుబడులు తగ్గుతాయి. ఈ రెండు లోపాలను అధిగమించి నూతన వంగడాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయి.
- ఆరుతడి విధానంలో ఇక్కడి రైతులు అనుసరించిన విధానం దేశవ్యాప్తంగా అనుసరణీయమేనా?
శాస్త్రవేత్త:చెరువుజమ్ములపాలెంలో రైతులు సాగు చేసిన విధానాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసి అధ్యయనం చేస్తాం. ఇక్కడి రైతులు విజయవంతంగా పంట పండించినందున దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ విధానం అనుసరణీయం. దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తాం.
- దమ్ము చేసి నాట్లు వేసి వరికి నిరంతరం నీరు పెట్టడం వల్ల మీథేన్ వాయువు ఉత్పత్తి పెరిగి వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్న వాదనలు ఉన్నాయి? దీనిని నివారించే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
శాస్త్రవేత్త:వరికి నిరంతరం నీరు పెడితేనే పండుతుందన్న అపోహలోనే రైతులు ఉన్నారు. దీంతో నిత్యం పొలంలో నీరు ఉండేలా చూస్తున్నారు. దీనివల్ల మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. దీనిని నివారించడానికి, ఖర్చు తగ్గించడానికి ఆరుతడి విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నాం. ప్రస్తుతం కిలో ధాన్యం పండించడానికి 5వేల లీటర్ల నీరు వినియోగిస్తున్నాం. దీనిని సగానికి తగ్గించే దిశగా ఆరుతడి విధానాన్ని తీసుకొస్తున్నాం.
ఇదీ చదవండి