గుంటూరు నగరంలోని 18 డివిజన్లో భారీగా దొంగ ఓట్లు పోలింగ్ అయ్యాయని.. కొందరు రిగ్గింగ్‌కి పాల్పడ్డారని ఇండిపెండెంట్ అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ కాశీ విశ్వనాథం ఆరోపించారు. నిన్న నల్లపాడులోని ఎంబీబీఎస్, పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బ్యాలెట్ బాక్స్‌లో నకిలీ స్వస్తిక్ గుర్తు అతుక్కుని వచ్చిందన్నారు. ఈ విషయాన్ని తాను కౌంటింగ్ సూపర్వైజర్, రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తేందుకు ప్రయత్నం చేయగా అవకాశం దొరకలేదని తెలిపారు. ఎన్నికల సంఘం ఇచ్చిన స్వస్తిక్ గుర్తు, నిన్న దొరికిన స్వస్తిక్ గుర్తు వేర్వేరుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై తాను ఎంత అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఓట్ల లెక్కింపు పూర్తిచేసి వైకాపా అభ్యర్థులను గెలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ స్వస్తిక్ గుర్తుతో దొంగ ఓట్లు వేసి రిగ్గింగ్‌కు పాల్పడిన అభ్యర్థులను, వారికి సహకరించిన ఎన్నికల అధికారులు, ఏజెంట్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. కాగా 18 డివిజన్లో వైకాపా అభ్యర్థి 628 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.