Telangana Secretariat Inauguration Postponed : తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈనెల 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. సచివాలయ ప్రారంభోత్సవ అంశంపై సీఈసీని సీఎస్ శాంతికుమారి సంప్రదించారు. సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Telangana New Secretariat Inauguration Postponed : తెలంగాణ సచివాలయం 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమవుతోంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు కాగా.. 265 అడుగుల ఎత్తున నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. 11 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమవుతోంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్ తదితరాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలను ఏర్పాటు చేశారు. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు.