గుంటూరు జిల్లా బాపట్లలో అధికార పార్టీ నేతలకు ఇసక దందా కాసుల వర్షం కురిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ నుంచి అనుమతి లేకుండా.. నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంట భూముల మధ్య జేసీబీలతో తొమ్మిది అడుగుల లోతున ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వందల ట్రక్కుల ఇసుకను ప్రైవేటు లేఅవుట్లకు తరలిస్తూ.. జేబులు నింపుకుంటున్నారని మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాలపై స్థానిక అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనే అపవాదు ఉంది.
ప్రస్తుతం బాపట్ల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకోవటంతో.. నిర్మాణ రంగం ఊపందుకుంది. నిర్మాణాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇసుక ఏమాత్రం సరిపోవటం లేదు. దీంతో మార్కెట్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకొని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్, ముగ్గురు నేతలు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. తీర గ్రామాల్లో ఇసుక భూముల్లో జోరుగా అక్రమ తవ్వకాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రైతుల భూముల్లో అనుమతులు లేకుండా నాలుగు ఎకరాల్లో జేసీబీలతో తొమ్మిది అడుగలకుపైగా ఇసుకను తవ్వేస్తున్నారని చెబుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను స్థిరాస్తి వ్యాపారులకు, ప్రైవేటు లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజల వాదన.