JANASENA CHIEF PAWAN KALYAN COMMENTS: మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ అరాచక పాలనపై యుద్ధం ప్రకటించేందుకు.. ‘నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అంటూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్ చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి విచ్చేసి.. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. బీసీ కులాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..''నేను కాపు నాయకుడిని కాదు.. ఒక కులానికి మాత్రమే పరిమితం కాదు. నేను ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదు. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలి. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే ఎప్పటికైనా దేహీ అనాల్సి వస్తోంది. బీసీ కులాలు 93 ఉంటే ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయి?. బీసీలకు అవకాశం ఇస్తేనే కదా.. నాయకత్వం ఎదిగేది. బీసీల ఓట్లే మీకు పడవు అని బీసీలే హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను బీసీ నాయకులతో పలు రకాలుగా తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే.. రెండు వర్గాలవారు గ్రామ స్థాయిలో ఘర్షణకు దిగుతారు. పన్నాగం పన్నిన నాయకులు ఏ పార్టీలో ఉన్నా విమర్శించుకోరు. పన్నాగం పన్నిన నాయకులు విమర్శించుకున్నా.. పద్ధతిగా ఉంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాలను జాబితా నుంచి తొలగించారు. జాబితా నుంచి తొలగించడంపై బీసీలు ఎందుకు ఉద్యమించట్లేదు?. బీసీ కులాలను జాబితా నుంచి తొలగించడంపై ఒక్క నాయకుడు స్పందించలేదు. కులాలను జాబితా నుంచి తొలగిస్తే ఏపీకి చెందిన ఒక్క బీసీ మంత్రి మాట్లాడరు. ఒక్క జనసేన మాత్రమే బలంగా మాట్లాడింది.'' అని ఆయన అన్నారు.