ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Telangana Budget : ఈ సారి కూడా తెలంగాణ బడ్జెట్​లో సాగునీటి ప్రాజెక్టులకే పెద్దపీట - కాళేశ్వరం ప్రాజెక్టుకు 16 వేల కోట్లు

Telangana Budget 2023-24: 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకే పెద్దపీట వేయనుంది. ఈ మేరకు వచ్చే బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అగ్ర తాంబూలం ఇవ్వనుంది. దీని కోసం సుమారు రూ.37 వేల కోట్లు కేటాయించినట్టు సమాచారం. అందులో 16 వేల కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించనున్నారు.

Telangana Budget 2023-24
Telangana Budget 2023-24

By

Published : Jan 20, 2023, 1:07 PM IST

Telangana Budget 2023-24: వచ్చే బడ్జెట్‌లోనూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. కొన్ని ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఆగిపోవడం, రాష్ట్ర ఖజానా నుంచి లక్ష్యం మేరకు నిధులు విడుదల చేయలేకపోవడం తదితర కారణాల వల్ల మొత్తం వ్యయంలో కొంత తగ్గింది.

Budget for Telangana Irrigation : అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ కొలిక్కివచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా, నిధులు కేటాయించడంతోపాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులనూ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. గత రెండు రోజులుగా ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య దీనిపై సమావేశాలు జరిగాయి.

TS Irrigation Projects: సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లించాల్సిన అసలు, వడ్డీలకు, కొత్తగా తీసుకునే రుణాలు, మార్జిన్‌ మనీ, రాష్ట్ర ఖజానా నుంచి భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్ననీటి వనరులకు కలిపి రూ.37 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని తగ్గించాలని నిన్న జరిగిన సమావేశంలో ఆర్థికశాఖ అధికారులు సూచించినట్లు సమాచారం.

వచ్చే బడ్జెట్‌లోనూ కాళేశ్వరం ఎత్తిపోతలకు ఎక్కువ మొత్తం కేటాయించనున్నట్లు సమాచారం. తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లింపు ప్రారంభమైంది. ఇందుకోసం 11 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ప్రాజెక్టు పనులు, మార్జిన్‌ మనీ, భూసేకరణ.. ఇలా అన్నింటికీ కలిపి 5 వేల కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే 16 వేల కోట్లు కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 4,400 కోట్లు, కల్వకుర్తికి 600 కోట్లు కేటాయించనున్నారు. సీతారామ ఎత్తిపోతలకు వెయ్యి కోట్లు కేటాయించనున్నారు. ఈ పథకానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నందున మార్జిన్‌ మనీ, భూసేకరణ మొదలైన వాటికి మాత్రమే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. కరీంనగర్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పరిధిలో ఉన్న వరద కాలువకు 500 కోట్లు, ఎస్ఆర్ఎపీ ఆధునికీకరణకు 400 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, మొత్తం బడ్జెట్‌పై ఒకటీ రెండు రోజుల్లో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details