HIGHCOURT : రాజధానికి భూములిచ్చిన రైతులకు మొదట అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పిటిషనర్ల వాదన సరికాదని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. అలాంటి నిబంధన సీఆర్‌డీఏ చట్టంలో లేదన్నారు. రాజధాని కోసం సమీకరించిన భూమిలో 5శాతం ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాల కేటాయింపునకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎంతో మంది గూడు లేక చెట్లకింద నివసిస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.
రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు పీఎంఏవై పథకం కిందకు వస్తాయన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం సీజే నేతృత్వంలోని బెంచ్ ముందు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు అయ్యిందని.. ప్రస్తుత వ్యాజ్యాలను అక్కడికే పంపడం ఉత్తమం అని వాదనల ప్రారంభానికి ముందు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుత వ్యాజ్యాలకు సీజే బెంచ్ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదన్నారు.