AP HIGH COURT: కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంపై.. హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఏడాదిలో ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య.. 4 వేలు దాటిందని గుర్తు చేసింది. ధిక్కరణ వ్యాజ్యాలు పెరగడంతో కోర్టు ముందు హాజరయ్యే ఉన్నతాధికారుల సంఖ్య పెరిగిందని తెలిపింది. గతంలో పార్ట్ టైంగా పని చేసిన టీచర్ల పింఛన్ ప్రయోజనాల కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తమకు పెన్షన్ ప్రయోజనాలు కల్పించే విషయంలో.. సర్వీసును క్రమబద్ధీకరించడానికి ముందున్న సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని 1985-1991 మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో.. పార్ట్ టైం టీచర్లుగా పనిచేసిన పలువురు గతంలో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషనర్లకు అనుకూలంగా ట్రైబ్యునల్ 2017 ఏప్రిల్‌లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును.. ప్రభుత్వం సవాల్ చేయగా హైకోర్టు, సుప్రీంకోర్టు తోసిపుచ్చాయి. పెన్షన్ ప్రయోజనాలు కల్పించకపోవడంతో 2020లో ఉపాధ్యాయులు.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు వేశారు.
ఇటీవల విచారణ జరిపిన కోర్టు ప్రతివాదులుగా ఉన్న ఐఏఎస్‌లను హాజరు కావాలని ఆదేశించింది. శుక్రవారం వారు విచారణకు హాజరయ్యారు. సర్వీసు క్రమబద్ధీకరణకు ముందు పనిచేసిన కాలానికి.. పిటినర్లకు పెన్షన్ ప్రయోజనాలు కల్పిస్తూ జీవో జారీచేసినట్లు ఏజీ తెలిపారు. దీంతో ఆ వ్యాజ్యాలపై విచారణ 2023 ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. జీవో జారీతో.. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్., విశ్రాంత ఐఏఎస్ చిన వీరభద్రుడు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌లకు తదుపరి విచారణకు.. హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు చేసి... ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్యను తగ్గిస్తామని.. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు.