High Court on Socialmedia Posts: గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన సీహెచ్ గోపికృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాల పనితీరుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన పసుపులేటి వీరాస్వామి 2020 మే 5న గోపికృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153c, 500, 500ఏ, 505(1)బి, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై ప్రస్తుతం పాలకొల్లు కోర్టులో విచారణ జరుగుతోంది.
తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని గోపికృష్ణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయవాది జాగర్లమూడి కోటేశ్వరీదేవి వాదనలు వినిపించారు. తెదేపా సానుభూతిపరులను వేధించడం కోసం తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా పోలీసులు పిటిషనర్‌పై కేసు పెట్టారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ చేయడానికి వీల్లేకుండా గొంతు నొక్కుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని పొగుడుతూ పిటిషనర్ పోస్టులు పెట్టారే తప్ప.. రెండు గ్రూపుల మధ్య విద్వేషాలు పెంచే ప్రస్తావనే లేదన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవన్నారు.