CM Jagan Namburu Tour: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా నంబూరుకు వెళ్లనున్నారు. నంబూరులోని మదర్సాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హజ్ హౌస్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ అరీఫ్ హఫీజ్ నంబూరులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదిక, హజ్ యాత్రికులతో మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం భద్రతా సిబ్బంది కూడా మదర్సా వద్ద తనిఖీలు నిర్వహించారు. అలాగే మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ సాయంత్రం గుంటూరు జిల్లా నంబూరుకు రానున్నారు. హజ్ యాత్రకు వెళ్తున్న హాజీలకు శుభాకాంక్షలు తెలపనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు నంబూరు హౌజ్ క్యాంప్‌లో హాజ్ యాత్రికులతో భేటీ అవుతారు.
చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ:హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలపడానికి చంద్రబాబు.. సాయంత్రం ఐదున్నర గంటలకు నంబూరు వస్తున్నారని పార్టీ శ్రేణులు షెడ్యూల్ కూడా ప్రకటించారు. చంద్రబాబు పర్యటన ఖరారైన తర్వాత హడావుడిగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి పర్యటనతో చంద్రబాబు పర్యటనకు అనుమతిపై కాస్తా సందిగ్ధత నెలకొంది. సీఎం వచ్చి వెళ్లిన తర్వాత చంద్రబాబు పర్యటనకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఓ వైపు సీఎం.. మరోవైపు మాజీ సీఎం:గుంటూరు జిల్లా నంబూరులో అధికార పార్టీ అధినేత.. ప్రతిపక్ష పార్టీ అధినేత పర్యటనలు ఒకేసారి ఉండటంతో రాజకీయ వర్గాల్లో కాస్తా ఆసక్తి నెలకొంది. ఇద్దరూ ఓకేసారి పర్యటిస్తారా.. లేకుంటే ముందు ముఖ్యమంత్రి పర్యటన ఉండి అనంతరం చంద్రబాబు పర్యటన ఉంటుందా అనే విషయంపై కూడా కాస్తా ఉత్కంఠ నెలకొంది. అలాగే రెండు పార్టీల ప్రధాన నేతలు పర్యటనలు ఉండటంతో శాంతి భద్రతల సమస్య విషయంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఇద్దరికి ఒకేసారి కాకుండా.. ఒకరి తర్వాత ఒకరి పర్యటనలు ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇద్దరు నేతల పర్యటనల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆందోళనలు, ఘర్షణలకు తావు లేకుండా పర్యటనలు సాగేలా అన్ని చర్యలు తీసుకున్నారు.
నిన్నటి నుంచి ప్రారంభమైన హజ్ యాత్ర: ముస్లిం సోదరులు హజ్ యాత్ర నిన్న ప్రారంభమైంది. నిన్న ఉదయం 9గంటలకు ఏస్జి 5007 విమానం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభమైంది. 170 మంది ప్రయాణికులతో నేరుగా విమానం జెడ్డాకు చేరుకోనుంది. 41 రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జులై 17వ తేదీన ముస్లింలు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఈసారి ముస్లిం సోదరులందరూ గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింజి. అలాగే అన్ని జిల్లాల నుంచి ముస్లింలను విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాల్వో బస్సులను ఏర్పాటు చేశారు.