Cultivated Vattiveru Without Soil: మట్టి అవసరం లేకుండానే వట్టివేరు సాగు చేస్తున్నారు.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అన్నాప్రగడ సాయిప్రసాద్. ఆరు పదుల వయసులో వ్యవసాయంపై ఇష్టంతో ఎకరం భూమి కౌలుకు తీసుకొని మరీ కూలీలు, యంత్రాల్లేకుండానే ఓ పంట తీసేందుకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట-నరసరావుపేట ప్రధాన రహదారిలో కేశానుపల్లి వద్ద ఉన్న ఆయన పంట క్షేత్రాన్ని చూసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకూ ఆయన ఏం చేశారంటే... ఇనుప తీగలను అడుగు వ్యాసార్థం, 4 అడుగుల ఎత్తులో ట్రీ గార్డ్‌లా చుట్టి అందులో సొంతంగా తయారు చేసుకున్న ఎరువు నింపారు. ఒక్కో టవర్ చుట్టూ 25 నుంచి 30 వట్టివేరు కాండాల్ని నాటారు. వీటికి నీరందేలా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 12 నెలల వరకు మొక్క పెరిగి ఆ తర్వాత ఎండిపోయింది. టవర్ చుట్టూ ఉన్న మొక్క అవశేషాలు తీసేసి.. లోపల ఉన్న వేరు తీసుకోవడమే తరువాయి. సాయిప్రసాద్ పెంచిన మొక్కలు ఇప్పుడు ఈ దశలోనే ఉన్నాయి. ఇలా సేకరించిన వేర్ల నుంచి నూనె తీస్తారు.
సాధారణంగా భూమిపై పెంచితే వేరు తవ్వి తీసేందుకు శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వర్టికల్ సాగు చేసినట్లు సాయిప్రసాద్ తెలిపారు. ‘వట్టివేరు నూనెను ఔషధ, సుగంధ ద్రవ్యాల్లో వాడతారు. ప్రస్తుతం మార్కెట్లో లీటరు ధర రూ.15 వేలు పలుకుతోంది. ఒక ఎకరంలో కనిష్ఠంగా 25 లీటర్లు, గరిష్ఠంగా 40 లీటర్ల నూనె తీయొచ్చు. ఎకరా సాగుకు రూ.లక్ష ఖర్చు పోయినా.. నికరంగా రూ.2 లక్షలు మిగులుతుంది. లఖ్‌నవూలో దీనికి మార్కెట్ ఉంది. లఖ్‌నవూలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమెటిక్ ప్లాంట్స్ (సీమ్యాప్) సంస్థ మొక్కలను పెంచుతోంది’ అని ప్రయోగాత్మకంగా సాగు చేపట్టిన సాయిప్రసాద్ వివరించారు.